మరోసారి విరుచుకుపడిన కంగ‌న‌

Kangana Ranaut opens up about Hrithik
Sunday, March 3, 2019 - 17:15

హృతిక్ రోషన్, కంగన రనౌత్ మధ్య నడిచిన వివాదం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఈ వివాదం గురించి ఎవర్ని అడిగినా చెబుతారు. అయితే దీనిపై స్పందించడానికి హృతిక్ పెద్దగా ఆసక్తి చూపడు. కంగన మాత్రం తనకు వీలుచిక్కినప్పుడల్లా ఈ వివాదాన్ని రేపుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి హృతిక్ పై కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. 

ఇండియాటుడే కాంక్లేవ్ లో పాల్గొన్న కంగన రనౌత్, తను ఎవరో తెలియదంటూ హృతిక్ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించింది. అసలు హృతిక్ చెప్పిన విషయం నమ్మేలా లేదంటోందామె. కైట్స్, క్రిష్-3 సినిమాల్లో తామిద్దరం కలిసి నటించామని, అలాంటప్పుడు తానెవరో తెలియదని హృతిక్ వ్యాఖ్యానించడంలో అర్థంలేదంటోంది.

హృతిక్ తనను నిరాశ-నిస్పృహల్లోకి నెట్టేసినా తను మాత్రం ఆ చేదు ఘటనల నుంచి తొందరగానే బయటకొచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగానంటోంది కంగనా. అలాంటి ఎన్నో చేదు అనుభవాల నుంచి ఇప్పుడు ఓ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నానని, ఇకపై తన జీవితంలో డేటింగ్స్ ఉండవని, కేవలం తోడు మాత్రమే కోరుకుంటానని అంటోంది.

గతంలో హృతిక్-కంగనా మధ్య తీవ్రస్థాయిలో డేటింగ్ కు సంబంధించిన రచ్చ జరిగింది. హృతిక్ రాసిన కొన్ని ఈమెయిల్స్ ను కంగనా బయటపెట్టింది. అది తన మెయిల్ ఐడీ కాదంటూ హృతిక్ వాదించాడు. తనతో డేటింగ్ చేసిన విషయాన్ని బయటకు చెప్పడానికి హృతిక్ భయపడుతున్నాడని ఎద్దేవా చేసింది కంగనా. అలా చాలా రోజుల పాటు వీళ్లిద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. అది కోర్టు నోటీసుల వరకు కూడా వెళ్లింది.