డైర‌క్ట‌ర్ క్రిష్‌తో గొడ‌వ‌ప‌డ‌లేద‌ట‌

Kangana refutes rumors of rift with director Krish
Sunday, August 26, 2018 - 23:30

"మ‌ణిక‌ర్ణిక" సినిమాకి సంబంధించిన షూటింగ్‌, ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌తో సంబంధం లేకుండా కంగ‌నా ర‌నౌత్ చూసుకుంటోంద‌నేది నిజం. తెలుగు సినిమా.కామ్ ఈ న్యూస్‌ని ఇంత‌కుముందే ప్ర‌చురించింది. "మ‌ణిక‌ర్ణిక" షూటింగ్‌ని క్రిష్ మ్యాగ్జిమ‌మ్ పూర్తి చేసినా.. కంగ‌నాకి కొన్ని సీన్లు న‌చ్చ‌లేదు. వాటిని రీషూట్ చేయాల‌ని కోరింది. కానీ అప్ప‌టికే క్రిష్ ..ఎన్టీఆర్ బ‌యోపిక్ ఒప్పుకున్నాడు. దాంతో చేయలేన‌ని అన్నాడు. విచిత్రం ఏమిటంటే.. ఏ ద‌ర్శ‌కుడు అయినా ఒక సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌యి, సెన్సార్ పూర్త‌య్యేవ‌ర‌కు ఆ సినిమాతోనే ఉంటాడు, మ‌రో సినిమా షూటింగ్ ఒప్పుకున్నాను అని వెళ్ల‌కూడ‌దు. మొత్తం అన్ని ప‌నుల‌ను పూర్తి చేయ‌డం డైర‌క్ట‌ర్ బాధ్య‌త‌. కానీ క్రిష్‌..షూటింగ్ పూర్తి చేశాను, నా ప‌ని అయిపోయింద‌న్న‌ట్లుగా "మ‌ణిక‌ర్ణిక" నుంచి త‌ప్పుకున్నాడు. 

దాంతో క్రిష్‌కు, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు గొడవ జరిగిందని ప్ర‌చారం మొద‌లైంది. ఐతే అలాంటిదేమీ లేద‌ని కంగ‌నా వివ‌ర‌ణ ఇచ్చిందిపుడు. క్రిష్‌తో ఎలాంటి విభేదాలు లేవు,  మేమిద్దరం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటామ‌ని చెపుతోంది కంగ‌నా. 

విభేదాలు లేన‌పుడు, డైర‌క్ట‌ర్ మొత్తం పోస్ట్‌ప్రొడక్ష‌న్‌తో స‌హా పూర్తి చేసి వెళ్లాలి క‌దా అంటే స‌మాధానం రావ‌డం లేదు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని సంక్రాంతికి విడుద‌ల చేయాలి కాబ‌ట్టి అటు వెళ్లాడని చెపుతోంది. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవితం ఆధారంగా మ‌ణిక‌ర్ణిక సినిమాని మొద‌లుపెట్టాడు క్రిష్‌. కంగ‌న ఝాన్సీ ల‌క్ష్మీబాయ్‌గా న‌టిస్తోంది. బాహుబ‌లి రైట‌ర్ విజయేంద్ర‌ప్ర‌సాద్ దీనికి ర‌చ‌యిత‌. ఐతే క్రిష్ తీసిన కొన్ని స‌న్నివేశాల విష‌యంలో కంగ‌నాకి కొన్ని విభేదాలున్నాయ‌ట‌. వాటిని మ‌ళ్లీ తీయాల‌ని ఆమె అడిగితే క్రిష్ నో చెప్పిన‌ట్లు స‌మాచారం. దాంతో కంగ‌నా స్వ‌యంగా వాటిని తీసుకుంటోంది. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఆమె చూసుకుంటోంది. 

క్రిష్ ..ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో బిజీగా ఉన్నాడు.