క్రిష్‌తో పేరు పంచుకుంటోన్న కంగ‌న‌

Kangana will share the director's credit with Krish
Wednesday, October 31, 2018 - 22:45

"మ‌ణిక‌ర్ణిక" సినిమాని 90 శాతం ద‌ర్శ‌కుడు క్రిష్ తీశాడు. ఐతే మొత్తం ర‌ష్ చూసుకున్న కంగ‌నాకి ... కొన్ని సీన్లు న‌చ్చ‌లేదు. దాంతో ఆమె రీషూట్ చేసింది. 45 రోజుల పాటు చిత్రీక‌రించింది. ఒక ద‌శ‌లో డైర‌క్ట‌ర్‌గా క్రిష్ పేరు తొల‌గించి, త‌న పేరే వేసుకుంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఐతే ఆ మ‌ధ్య విడుద‌లైన ట్ర‌యిల‌ర్‌లో మాత్రం  జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ అనే పేరుని ఉంచారు. దాంతో క్రిష్ ఊపిరి పీల్చుకున్నాడు.

తాజాగా ముంబైకి చెందిన మిడ్‌డే క‌థ‌నం ప్ర‌కారం కంగ‌న ఇపుడు మ‌న‌సు మార్చుకుంద‌ట‌. క్రిష్‌తో పాటు త‌న పేరుని కూడా ద‌ర్శ‌కురాలిగా సినిమా క్రెడిట్స్‌లో ఉంచుతోంద‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా వికీపీడియా పేజీలో డైరక్టర్ పేరుగా క్రిష్‌, కంగ‌నా ఇద్ద‌రి పేర్లు ఉన్నాయి. నిర్మాత‌లు కూడా ఇదే విష‌యాన్ని క‌న్‌ఫ‌మ్ చేశార‌ట‌. సినిమాలో కీల‌క సీన్ల చిత్రీక‌ర‌ణ‌తో పాటు గ్రాఫిక్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ కంగ‌న స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించింది. ఒక ద‌ర్శ‌కుడు చేయాల్సిన ప‌నుల‌న్నీ ఆమె చేసింది. కాబ‌ట్టి ఆమె పేరుని కూడా డైర‌క్ట‌ర్‌గా చేరుస్తున్నామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

క్రిష్ ఈ సినిమాని వ‌దిలి ..ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని చిత్రీక‌రిస్తున్నాడు. మ‌ణిక‌ర్ణిక క‌న్నా ఎన్టీఆర్ బ‌యోపిక్ క్రిష్ కెరియ‌ర్‌కి ఉప‌యోగ‌ప‌డుతుంది.