ప్ర‌భాస్ అంత ఎమౌంట్ ఇచ్చాడా?

Kerala Minister talks about Prabhas
Tuesday, September 4, 2018 - 14:30

కేర‌ళ వ‌ర‌ద‌ల ప్ర‌ళ‌యానికి చ‌లించిన టాలీవుడ్ తార‌లు అంద‌రూ భారీ విరాళాన్ని అందించారు. మ‌న అగ్ర హీరోలెవ్వ‌రికీ కేర‌ళ‌లో పెద్ద మార్కెట్ లేదు. కోలీవుడ్ హీరోల సినిమాల‌తో పోల్చితే మ‌న సినిమాలు పెద్ద‌గా ఆడ‌వు. ఐనా కానీ మ‌న వారు అవేవీ ఆలోచించ‌లేదు. ఉదారంగా విరాళాలు ఇచ్చి త‌మ గొప్ప హార్ట్‌ని చాటుకున్నారు. చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, నాగార్జున‌. ఇలా అంద‌రూ పాతిక ల‌క్ష‌ల చొప్పున విరాళాలు ఇచ్చారు. క‌ల్యాణ్‌రామ్‌, రామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి ఇత‌ర హీరోలు కూడా ప‌ది నుంచి ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు అందించారు. వారు ప్ర‌క‌టించిన విరాళాలు అన్ని మీడియాలో వ‌చ్చాయి.

ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ వంటి త‌మిళ హీరోలు 15 ల‌క్ష‌ల రేంజ్‌లో ఇచ్చారు. ఐతే కేరళ పర్యాటక శాఖ మంత్రి సురేంద్రన్ కొత్త‌గా ఓ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ప్ర‌భాస్ ఏకంగా కోటి రూపాయ‌ల విరాళం ఇచ్చాడ‌ని చెప్పాడు. ప్ర‌భాస్‌కి ఇక్క‌డ మార్కెట్ లేక‌పోయినా అంత ఇచ్చాడు కానీ మ‌ల‌యాళ స్టార్స్ ఎవ‌రూ విరాళాలు ఇవ్వ‌లేద‌ని అత‌ను వారిని వాయించాడు. అంతేకాదు మ‌ల‌యాళ న‌టులు  ప్ర‌భాస్‌ని చూసి నేర్చుకోవాల‌న్నాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ ప్ర‌భాస్ కోటి రూపాయ‌ల విరాళం ఇచ్చాడ‌ని చెప్పాడమే హాట్ టాఫిక్ అయింది. మ‌న మిగ‌తా టాలీవుడ్ పెద్ద హీరోల్లాగే పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లు అందిస్తున్న‌ట్లు ఇంత‌కుముందు ప్ర‌భాస్ ప్ర‌క‌టించాడు. ఆయ‌న పీఆర్‌వోలు కూడా అదే చెప్పారు.  కానీ ఆ కేర‌ళ మంత్రి ప్ర‌భాస్ కోటి ఇచ్చాడని చెపుతున్నాడు.

ప్ర‌భాస్ మాత్రం త‌న ఫేస్‌బుక్‌లో కూడా ఈ విష‌యం రాయ‌లేదు. సైలెంట్‌గా ప్ర‌చారానికి దూరంగా ఇచ్చాడా?