డైర‌క్ట‌ర్‌గా క్రిష్ పేరు తొల‌గించిన కంగ‌న‌

Krish name removed as director?
Thursday, August 30, 2018 - 20:15

అనుకున్న‌ట్లే జ‌రిగింది. "మ‌ణిక‌ర్ణిక" సినిమాకి డైర‌క్ట‌ర్‌గా త‌న పేరు వేసుకొంది కంగ‌న ర‌నౌత్‌. "మణిక‌ర్ణిక" సినిమా మొత్తాన్ని క్రిష్ డైర‌క్ట్ చేయ‌గా ఇపుడు రీషూట్ మొద‌లుపెట్టింది కంగ‌న‌. అంతేకాదు డైర‌క్ట‌ర్‌గా తన పేరును చెప్పుకుంటోంది. క్లాప్‌బోర్డ్ మీద డైర‌క్ట‌ర్‌: క‌ంగ‌న ర‌నౌత్ అనే పేరు ఉన్న ఫోటో ఒకటి తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

వీర‌వ‌నిత రాణి ఝాన్సీల‌క్ష్మీబాయ్ జీవితం మ‌ణిక‌ర్ణిక పేరుతో తెర‌కెక్కుతోంది. "గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి" సినిమాని చూసి ఈ క‌థ‌కి క్రిష్ అయితే బాగుంటుంద‌ని ఏరి కోరి సెల‌క్ట్ చేసింది కంగ‌న. అంత‌కుముందు వేరే బాలీవుడ్ ద‌ర్శ‌కుడిని తీసుకున్నారు నిర్మాత‌లు. ఐతే కంగ‌నా సూచన మేర‌కు క్రిష్‌ని తీసుకున్నారు ఆ బాలీవుడ్ డైర‌క్ట‌ర్‌ని తొల‌గించి. క్రిష్ 95 శాతం సినిమాని పూర్తి చేసి... చివ‌ర్లో త‌ప్పుకున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఉంద‌ని క్రిష్ బ‌య‌టికి వ‌చ్చాడు. మిగ‌తా భాగాన్ని, పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంగ‌నా పూర్తి చేసుకునేలా ముందే మాట్లాడుకున్నాడ‌ట‌.

సినిమాలో కొన్ని సీన్లు బాగా లేవ‌ని కంగ‌న స్వ‌యంగా త‌నే రీషూట్ చేసుకుంటోంది. ఈ రీషూట్ సీన్లు తీస్తున్న‌ప్పుడు యూనిట్‌లో ఉన్న స‌భ్యులు క‌న్‌ఫ్యూజ్ కావ‌ద్ద‌ని, అలాగే సినిమాని ఎడిట్ చేసేట‌పుడు క్లారిటీ ఉంటుంద‌నే ఉద్దేశంతో క్లాప్ బోర్డ్‌పై త‌న పేరును వేసుకున్న‌ట్లు ఇపుడు కంగ‌న వివ‌ర‌ణ ఇస్తోంది.

అయితే తీరా సినిమా విడుద‌ల టైమ్‌కి క్రిష్ పేరు సినిమా టైటిల్స్‌లో ఉంటుందా అనేది చూడాలి.