ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీకి వెళ్ల‌డం ఖాయ‌మే!

Lagadapati says Pawan Kalyan will win as MLA
Sunday, May 19, 2019 - 00:45

ఆయ‌న్ని ఇష్ట‌ప‌డేవాళ్లు ఆంధ్రా అక్టోప‌స్ అంటారు. ఈస‌డించుకునే వాళ్లు..ఒక బెట్టింగ్ మాఫియా కింగ్ అని అంటారు. ఆయనెవ‌రో కాదు..ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. తెలంగాణ బిల్లు పార్ల‌మెంట్‌లో పాస్ అవుతున్న‌పుడు పెప్పర్ స్ప్రే ఉదంతం నుంచి ఆయ‌న చ‌ర్య‌లు, చేష్ట‌లు అంతా వివాదాస్ప‌ద‌మే. ఒక‌వైపు, ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నిక‌ల సంఘం నిషేధం ఉండ‌గానే త‌న ప‌ర్స‌న‌ల్ అభిప్రాయం పేరుతో స‌ర్వే ఫలితాలు చెపుతున్నారు.

మొన్న జ‌రిగిన‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న చిల‌క జోస్యం అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. కేసీఆర్ ప్ర‌భుత్వం తిరిగి రాద‌ని చెప్పి ప‌రువు మూసీన‌దిలో క‌లుపుకున్నారు. ఐనా ఇపుడు మ‌ళ్లీ ఆంధ్రా ఫ‌లితాల‌పై శ‌నివారం రాత్రి ఓ బాంబు పేల్చారు. ఏపీలో ప్ర‌జ‌లు సైకిల్ యాత్ర‌నే కోరుకుంటున్నార‌ట‌.

అలాగే జ‌న‌సేన అధినేత వెల‌గ‌పూడి అసెంబ్లీలోకి గ్యారెంటీగా అడుగుపెడుతార‌ని చెప్పారు. అంటే జ‌న‌సేన అధినేత తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ సీట్ల‌లో క‌నీసం ఒక దాంట్లో అయినా గెలిచి తీరుతార‌నేది అంచ‌నా. ఈ విష‌యంలో ఎవ‌రికీ పెద్ద‌గా అనుమానాలు అవ‌స‌రం లేదు. ఏదో ఒక సీట్లో ఆయ‌న గెలుస్తార‌నేది అంద‌రూ చెపుతున్నమాట‌. ఆయ‌న గెలుపు గురించి ఏ స‌ర్వే అనుమానాలు వ్య‌క్తం చేయ‌లేదు. అదే మేట‌ర్‌ని త‌న‌దైన శైలిలో చెప్పారు ల‌గ‌డ‌పాటి. తాను ఎవ‌రికి ఏ విష‌యాన్ని చేర్చాలో అది చేర్చే క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీకి వెళ్తార‌ని కూడా చెప్పారు ఈ ఆక్టోప‌స్‌.

ఆయ‌న మాట ఈసారైనా నిజం అవుతుందా అనేది తెలుసుకోవాలంటే లెట్స్ వెయిట్ ఫ‌ర్ మే 23.