లారెన్స్ చేతిలోనే ల‌క్ష్మీబాంబ్‌

Lawrence back on the sets of Laxmmi Bomb?
Sunday, May 26, 2019 - 00:45

"ల‌క్ష్మీబాంబు" సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాను అని ప్ర‌క‌టించిన వారం రోజుల్లోనే మ‌రో అప్‌డేట్ ఇచ్చాడు రాఘ‌వ లారెన్స్‌. "ల‌క్ష్మీబాంబు" సినిమా నిర్మాత‌లు మ‌ళ్లీ త‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు వ‌స్తున్నార‌నీ, అవి ఫ‌లిస్తే మ‌ళ్లీ ఆ సినిమాని టేక‌ప్ చేస్తాన‌ని చెప్పాడు. ఆల్మోస్ట్ చేస్తున్న‌ట్లే తెలిపాడు.

"ల‌క్ష్మీబాంబు" అనేది "కాంచ‌న" చిత్రానికి బాలీవుడ్ రీమేక్‌. "కాంచ‌న" సిరీస్ చిత్రాలు తెలుగులోనూ, త‌మిళంలోనూ కాసుల వ‌ర్షం కురిపిస్తుండ‌డంతో బాలీవుడ్ క‌న్ను ప‌డింది. రాఘ‌వ లారెన్స్‌ని డైర‌క్ట‌ర్‌గా తీసుకొని బాలీవుడ్ నిర్మాణ సంస్థ అక్ష‌య్‌కుమార్ హీరోగా మొద‌లుపెట్టింది. బాలీవుడ్‌లో ఏ ద‌ర్శ‌కుడైనా క‌మ్యూనికేష‌న్‌లో వీక్‌గా ఉంటే.. అంతా నిర్మాణ సంస్థే చూసుకుంటుంది. డైర‌క్ట‌ర్‌ని సెట్‌కి మాత్ర‌మే ప‌రిమితం చేస్తుంది. లారెన్స్‌ని అలాగే చేశారు బాలీవుడ్ మేక‌ర్స్‌. ఆయ‌న‌కి తెలియ‌కుండానే సినిమా టైటిల్‌, సినిమా తొలి లుక్‌ని రిలీజ్ చేశారు. దాంతో లారెన్స్‌కి చిర్రెత్తుకొచ్చింది.

ద‌క్షిణాదిలో అన్నీ తానై సినిమాలు చేయ‌డం లారెన్స్ స్ట‌యిల్‌. కుదిరితే ...బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌తో ఓ సాంగ్ వేసుకుందామ‌ని (అదేనండి సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్‌కి డ్యాన్స్‌) ఏవో లెక్క‌లేసుకొని లారెన్స్ రంగంలోకి దిగాడు బాలీవుడ్‌లో. కానీ నిర్మాత‌లు అత‌న్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

డైర‌క్ట‌ర్‌కి చెప్ప‌కుండా ఫ‌స్ట్‌లుక్ ఎలా రిలీజ్ చేస్తారు? డ‌బ్బు క‌న్నా ఆత్మగౌర‌వం ముఖ్యం అంటూ లారెన్స్ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఐతే బాలీవుడ్ నిర్మాత‌ల‌కి మరో ద‌ర్శ‌కుడు వెంట‌నే దొర‌క‌లేదు. దాంతో చ‌చ్చుకుంటూ లారెన్స్ చేతిలోనే రీమేక్ డైర‌క్ష‌న్ పెడుతున్నారు.