లాక్డౌన్ మూవీ:మెమొరీస్ అఫ్ మర్డర్

Lockdown movie watch: Memories of Murder (2003)
Saturday, April 25, 2020 - 01:45

బంగారు వర్ణంలో మెరుస్తోన్న వరి పొలంలో దాక్కొన్న ఓ పిల్లాడు..... పురుగుల్ని పడుతుంటాడు. దూరం నుంచి...  ఓ ట్రాక్టర్ వస్తున్న శబ్దం రావడంతో  లేచి అటుగా చూస్తాడు.... ఆ ట్రాక్టర్ని వెంబడిస్తూ కొందరు చిన్నారులు ఆటలాడుతుంటారు. పల్లెటూరు లో సాధారణంగా కనిపించే దృశ్యం అది. 

కట్ చేస్తే... 

కాల్వలోని కల్వర్టులోకి తొంగి చూస్తాడు.... ఆ ట్రాక్టర్ పై వచ్చిన పోలీస్ డిటెక్టివ్. కాళ్ళు చేతులు తాడుతో కట్టి నగ్నంగా పడివున్న ఒక అమ్మాయి మృతదేహంపై కనిపిస్తోంది. ఈగలు, పురుగులు వాలాయి ఆ శవంపై. 

అలా మొదలవుతుంది "మెమొరీస్ అఫ్ మర్డర్" మూవీ. 1986 నుంచి 1991 వరకు దక్షిణ కొరియాలోని హాసాంగ్ అనే ప్రాంతంలో  జరిగిన సీరియల్ హత్యలు ఆధారంగా రూపొందిన యదార్థ గాథ ఇది. 2003లో విడుదలయిన ఈ సినిమాకి దర్శకుడు... ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందిన "పారసైట్" సినిమా తీసిన బాంగ్ జూన్ హో. బాంగ్ జూన్ కి బాగా పేరు తెచ్చిన మూవీ ఇది. ఇంకా చెప్పాలంటే అతని కెరీర్ బెస్ట్ మూవీ ఇదే అనే చెప్పే విశ్లేషకుల సంఖ్య ఎక్కువ ఉంది. 

కథ విషయానికొస్తే...

1986 అక్టోబర్ నెలలో హాసాంగ్ గ్రామీణ ప్రాంతంలో రేప్ కి గురై హత్య చెయ్యబడ్డ ఇద్దరు అమ్మాయిల మృత దేహాలు దొరుకుతాయి. స్థానిక పోలీస్ డిటెక్టివ్ పార్క్ పరిశోధన మొదలు పెడుతాడు. ఎవరి కళ్ళలోకి చూసైనా వాళ్ళు తప్పు చేశారా లేదా అని చెప్పగలను అని పార్క్ ధీమాగా చెప్తుంటాడు.  మానసికంగా సరిగా ఎదగని ఒక కుర్రాడిని అనుమానిస్తాడు పార్క్. మరోవైపు... రాజధాని నగరం సియోల్ నుంచి సియో అనే డిటెక్టివ్ వస్తాడు. ఇద్దరి నేర పరిశోధన మెథడ్స్ వేరు. దాంతో మొదట్లో ఇద్దరికీ పడదు...ఐతే వరుసగా మర్డర్స్ పెరుగుతుంటాయి. దాంతో ఎలాగైనా ఈ సీరియల్ కేసుల మిస్టరీ ఛేదించాలని కంకణం కట్టుకుంటారు... పార్క్, సియో. 

నేరస్తుడు వారికి చిక్కినట్లే చిక్కి జారిపోతుంటాడు. నెలలు గడుస్తుంటాయి... హత్యలు జరుగుతూనే ఉంటాయి. డిటెక్టివ్ ల జీవితాలు స్ట్రెస్ కి గురి అవుతాయి. దానికి తోడు... 1980లో కొరియాలో ఫోరెన్సిక్ సదుపాయాలు లేవు. అమెరికా నుంచి ఫోరెన్సిక్ రిజల్ట్స్ రావాలి. ఈ హత్యల వెనుక ఉన్నవాడు వీడే అని ఒకడిని పరిశోధించి తెలుస్తారు డిటెక్టివ్ లిద్దరూ. కానీ ఫోరెన్సిక్ రిజల్ట్  నెగటివ్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో సియో మళ్ళీ సియోల్ వెళ్ళిపోతాడు. దశాబ్దాలు గడిచిపోతాయి. ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది తేలదు. పార్క్ వయసు పైబడుతుంది. వాళ్లు శోధించి పట్టుకున్న వాడు నిజంగా అమాయకుడేనా? ఏమో...!

కొన్నేళ్ల తర్వాత  పార్క్ మళ్ళీ ఆ వూరు మీదుగా  వెళ్తుంటాడు. మొదటిసారి మృత దేహాలు కనిపించిన పొలాల వద్దకు రాగానే అతని కారుకి బ్రేకులు పడుతాయి. వాళ్లు శోధించి పట్టుకున్న వాడు నిజంగా అమాయకుడేనా? ఏమో...!

కొన్నేళ్ల తర్వాత (2003లో) పార్క్ మళ్ళీ ఆ వూరు మీదుగా వెళ్తుంటాడు ఒక బిజినెస్ పని మీద. డిటెక్టివ్ జాబ్ వదిలేసి... వ్యాపారం చేసుకుంటున్నాడు పార్క్ ఇప్పుడు. మొదటిసారి మృత దేహాలు కనిపించిన పొలాల వద్దకు రాగానే అతని కారుకి బ్రేకులు పడుతాయి. 

పంటకొచ్చిన బంగారు వర్ణం పొలాల మధ్య నుంచి చల్లని గాలిని ఆస్వాదిస్తూ... ఆ కల్వర్టు వద్దకు చేరుకుంటాడు పార్క్. అందులోకి తొంగి చూస్తూ ఉండగా... అటుగా వచ్చిన ఒక స్కూల్ విద్యార్థిని, "అక్కడ ఏమైనా ఉందా?" అని అడగడంతో ఉలిక్కి పడి చూస్తాడు పార్క్.

కొన్నాళ్ల క్రితం మీలాగే ఒకతను వచ్చి అందులోకి తొంగి చూశాడు... ఏమి చూస్తున్నారు అని అడిగితే, "గతంలో నేను ఇక్కడ ఒక పని చేసి వదిలి వెళ్ళాను...అది గుర్తొచ్చి చూడ్డానికి వచ్చాను" అని సమాధానం ఇచ్చాడు అని చెప్తుంది ఆ పాప. షాక్ తిన్న పార్క్ అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. సాదా సీదాగా ఉన్నాడు అని చెప్తుంది ఆ అమ్మాయి. పార్క్ ప్రేక్షకుల వైపు చూడడంతో మూవీ ఎండ్. 

ప్రోలోగ్ 
ఇంతకీ ఆ సీరియల్ కిల్లింగ్స్ చేసింది ఎవరు అనేది ఈ సినిమా విడుదల నాటికి కూడా మిస్టరీనే. అందుకే దర్శకుడు మూవీని ఆలా ఎండ్ చేశారు. సినిమా ప్రారంభం, ముగింపు రెండూ ఒకే చోట. మొదట్లో ఓ బాలుడు ఉంటాడు...చివరలో ఓ పాప ఉంటుంది.

ఐతే చిత్రంగా... ఆ హత్యలను నేనే చేశాను అంటూ ఒకతను గతేడాది (2019)లో పోలీసుల ముందుకొచ్చాడు. 

సీరియల్ కిల్లింగ్స్ పై హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ బాంగ్ జూన్ హో లా ఎవరూ తీయలేదు. ఆద్యంతం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాము. "పారసైట్" సినిమాలో తండ్రి పాత్ర పోషించిన సాంగ్ కాంగ్ హో... "మెమొరీస్ అఫ్ మర్డర్"లో డిటెక్టీవ్ పార్క్ గా నటించారు. తెలుగులో ఈ సినిమా స్ఫూర్తితోనే "అనసూయ" అనే సినిమా వచ్చింది. ఈ మధ్య వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన "రాక్షసుడు" సినిమాకి కూడా ఇదే స్ఫూర్తి. 

తప్పక చూడాల్సిన కొరియన్ క్లాసిక్ .. "మెమొరీస్ ఆఫ్ మర్డర్". "పారసైట్" సినిమా చూస్తూ  బోర్ ఫీల్ అయినా వారికి కూడా ఇది నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

- by J

Also Read
లాక్డౌన్ మూవీ: ఏ సెపరేషన్

లాక్డౌన్ మూవీస్: దియా, లవ్ మాక్ టైల్

- లాక్డౌన్ మూవీ: వికృతి