చూడాల్సిన మూవీ: కప్పెల

మూవీ: కప్పెల (మలయాళం) –  నెట్ ఫ్లిక్స్ 
Advertisement

కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి… ఉన్నవాటినే కొత్తగా చెప్పాలి….. 
సినిమా కథలన్నీ భారత రామాయణాల నుంచి పుడుతున్నవే… అక్కడి నుంచే పాయింట్స్ తీసుకుంటాం
– తల’పండిపోయిన’ తెలుగు సినీ కథా రచయితలు తరచూ ప్రవచించే మాటలు. ఆ సీనియర్మోస్ట్ రచయితలు అలాగే చేస్తారేమో? 

వాళ్లయినా, నవతరం దర్శక రచయితలైనా వర్తమాన సమాజాన్ని, మానవ జీవితాల్నీ, మారుతున్న జీవన శైలినీ… అందులోని ఈతిబాధలనీ, నిర్ణయాలు తీసుకోవడంలో యూత్ చూపిస్తున్న వేగాన్నీ, అందుకు సంబంధించిన ఫలితాన్నీ ఒకసారి పరికించి పరిశీలిస్తే కొత్త కథలు కచ్చితంగా పుడతాయి. వెదుకు… వెదికితే దొరకనిది ఉండదు అనే మాట గుర్తుకువస్తుంది. 

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ‘కప్పెల’ అనే మలయాళం సినిమాలో కథా వస్తువు మనం తరచూ వింటున్నదీ, పత్రికల్లో చదువుతున్నదీ. ఆ కథను దర్శకుడు ముస్తఫా మహమ్మద్ చెప్పిన విధానం మనల్ని కట్టిపడేస్తుంది.

కథ విషయానికి వస్తే….. 

జెస్సీ అనే యువతి ఫోన్ డయల్ చేసినప్పుడు ఒక అంకె తప్పుగా ప్రెస్ చేయడం వల్ల విష్ణు అనే ఒక ఆటో డ్రైవర్ కు వెళ్తుంది. జెస్సీ ఎక్కడో వయనాడ్ ప్రాంతంలోని ఒక మారుమూల పల్లెలో ఉంటుంది. విష్ణు కోజికోడ్ లో ఆటో డ్రైవర్. అక్కడి నుంచి వారి మధ్య మాటలు మొదలవుతాయి. ఆ మాటల్లోనే వాళ్ళు ప్రేమలోపడతారు. 

ప్లస్ టూ తప్పి ఇంట్లో ఉన్న జెస్సీపై అదే ఊళ్ళో ఉన్న బెన్నీ అనే కుర్రాడు మనసు పారేసుకుంటాడు. తల్లిని ఒప్పించి పెళ్లి సంబంధం మాట్లాడతారు. జెస్సీ తల్లితండ్రులు వాళ్ళకి పెళ్లి చేయాలి అనుకొంటారు. ఓ రోజు జెస్సీ ఇంట్లో నుంచి కోజికోడ్ వెళ్లిపోతుంది… విష్ణుని కలుసుకోవడానికి. సరిగ్గా వాళ్ళు కలుసుకొనే సమయానికి వారిద్దరి మధ్యకు రాయ్ అనే యువకుడు ప్రవేశిస్తాడు. వీళ్ళ మధ్యకు రాయ్ ప్రవేశించడానికీ ఫోన్ కారణం అవుతుంది. అదెలాగో చిత్రంలోనే చూడాలి. ఆ తరవాత జెస్సీ కథ ఏ తీరానికి చేరింది… ఒక రాంగ్ డయల్ అనేది జెస్సీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది… ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన జెస్సీ అనే అమాయక యువతిని రాయ్ ఏం చేశాడు అనేది ఈ కథలో కీలకం.

మొబైల్ ఫోన్ అనేది అరచేతిలో ప్రపంచాన్ని ఉంచింది. రాంగ్ డయల్ అనేది ఒక్కోసారి అందరూ చేస్తుంటారు. అలా ఎక్కడో గిరిజన ప్రాంతంలో ఉన్న యువతి చేసిన రాంగ్ డయల్ అనేది ఒక ప్రేమ కథగా మారుతుంది… ఆ ప్రేమ కథలో ఉన్న మలుపులు, పాత్రల మనస్తత్వాలు, ఆ పాత్రల తాలూకు ప్రవర్తనలు, ఉద్దేశాలు అన్నీ మనకు పరిచయం ఉండేవే.

కథను ఉత్కంతగా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ రసకందాయంలోపడేసరికి అయ్యో.. జెస్సీ… అమాయకపు పిల్ల అనిపిస్తుంది. జెస్సీగా అన్నా బెన్, విష్ణుగా రోషన్ మాథ్యూ, రాయ్ గా శ్రీనాథ్ భాసి చక్కగా ఒదిగిపోయారు. ఇదే కథను వయొలెంట్ గా చూపించి టెన్షన్ పెట్టొచ్చు. అయితే దర్శకుడు ఆ మార్గాన్ని ఎంచుకోకుండా కథను నెమ్మదిగా నడుపుతూ చివరికి వచ్చేసరికి టెన్షన్ పెడతాడు. నిడివి పూర్తిగా రెండు గంటలు కూడా ఉండదు

అక్కడక్కడా కథ మరీ నెమ్మదిగా సాగుతున్నట్లు… మరికొన్ని చోట్ల ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేయాల్సింది అనిపిస్తుంది. అయితే కథలోని మలుపులకు దర్శకుడు ముందే కొన్ని లీడ్స్ ఇస్తాడు.. అవే కథకు మలుపులు అని ప్రేక్షకుడు అంచనా వేయడు. దర్శకుడిగా మస్తాఫా మహమ్మద్ కి ఇది మొదటి సినిమా కావడం విశేషం.

ఫైనల్ టాక్: చూడండి 
(త్వరలోనే ఈ మూవీ తెలుగులోనూ రీమేక్ కానుంది. కానీ మలయాళంలో చూడడమే బెటర్)

By: వి.సి

Also Read

– లాక్డౌన్ మూవీస్: దియా, లవ్ మాక్ టైల్
– 
లాక్డౌన్ మూవీ: వికృతి

Advertisement
 

More

Related Stories