పాట‌ల ర‌చ‌యిత కుల‌శేఖ‌ర్ మ‌ళ్లీ అరెస్ట్‌

Lyricist Kulasekhar arrested in theft case
Monday, October 29, 2018 - 10:15

చిత్రం, నువ్వు నేను, సంతోషం, ఇంద్ర‌, నాగ‌, జ‌యం... ఇలా ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ సినిమాల‌కి పాట‌లు రాసిన ర‌చ‌యిత కుల‌శేఖ‌ర్ ఇపుడు ఒక దొంగ‌గా అరెస్ట్ అయ్యారు. పాట‌ల ర‌చ‌యితగా వైభ‌వం చూసిన కుల‌శేఖ‌ర్ నేడు ఒక దొంగ‌గా నిల‌బ‌డ‌డం విషాదం. 

చోరీ కేసులో కుల‌శేఖ‌ర్‌ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.. మూడు రోజుల క్రితం ఆర్బీఐ క్వార్టర్స్‌ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలోని పూజారి చేతి సంచి చోరీ చేశాడు కుల‌శేఖ‌ర్. శ్రీనగర్‌కాలనీలోని ఓ ఆలయంవద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆదివారం ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి రవికుమార్‌ తెలిపారు. 

ఇలా చోరీ కేసులో కుల‌శేఖ‌ర్ అరెస్ట్ కావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. మూడేళ్ల క్రితం కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేసిన కేసులో ఆరు నెలలపాటు రాజ‌మండ్రిలో జైలుశిక్షను అనుభవించాడు. 

బ్రాహ్మణుల మీద కులశేఖర్‌ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడనేది ఒక వాద‌న‌. ఐతే వ్య‌స‌నాల‌కి బానిస కావ‌డం వ‌ల్లే ఆయ‌న ఇలా దిగ‌జారాడ‌ని స‌న్నిహితులు అంటారు. ఆయ‌న మాన‌సిక స్థితి కూడా  స‌రిగా లేద‌నేది ఆయ‌న మిత్రులు చెపుతున్నారు.