మ‌హ‌ర్షి పోకిరి స్క్వేర్ అవుతుంద‌ని ముందే ఊహించా

Mahesh Babu speaks at Vijayawada Vijayotsavam
Saturday, May 18, 2019 - 23:45

"మ‌హ‌ర్షి" సినిమా "పోకిరి" స్క్వేర్ అవుతుంద‌ని ముందే ఊహించాను అని అన్నారు మ‌హేష్‌బాబు. డెహ్ర‌డూన్‌లో తొలి రోజు షూటింగ్ పూర్తి కాగానే టీమ్‌కి చెప్పా. "పోకిరి సినిమా ఇంటూ పోకిరి ఇది అవుతుంద‌ని చెప్పాను. ఎందుకంటే స్టూడెంట్ రోల్ పోషిస్తున్నపుడే అర్థ‌మైంది. ఈ సినిమాలో నేను స్టూడెంట్‌గా క‌నిపించ‌డ‌మే ఎక్కువ కిక్ ఇచ్చింద‌,"ని మ‌హేష్ ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక వేదిక‌పై చెప్పారు.

‘మహర్షి’ సినిమా విజ‌య‌యోత్స‌వంవిజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. మహేష్‌బాబు, అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి ఈవెంట్‌లో పాల్గొన్నారు. మ‌హేష్‌బాబుని హీరోగా ప‌రిచ‌యం చేసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

త‌న సినిమాలు ఎపుడు పెద్ద హిట్ట‌యినా...విజ‌య‌వాడ దుర్గ‌మ్మ త‌ల్లి త‌న వ‌ద్ద‌కి ర‌ప్పించుకుంటుంద‌ని అన్నారు మ‌హేష్‌బాబు. ఈ ఈవెంట్‌కి ముందు క‌న‌క‌దుర్గ గుడికి వెళ్లి ప్రార్థ‌న‌లు చేశారు మ‌హేష్ అండ్ టీమ్‌. మ‌హేష్‌బాబు న‌టించిన మ‌హ‌ర్షి తొలి వార‌మే 75 కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది. రెండోవారంలో ఏ మేర‌కు వ‌సూళ్లు అందుకుంటుంద‌నేది చూడాలి. ఐతే మ‌హేష్‌బాబు మాత్రం ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ని వ‌ద‌ల‌డం లేదు. దీన్ని పెద్ద హిట్‌గా బాక్సాఫీస్ తీరాల‌కి చేర్చాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. ఆయ‌న శ్ర‌మ ఫ‌లిస్తుందా అనేది చూడాలి. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకి దిల్‌రాజు, పీవీపీ, అశ్వ‌నీద‌త్ నిర్మాత‌లు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.