అవును..మ‌హేష్ ఈవెంట్ లేదిందుకే!

Mahesh Babu's event in NY cancelled
Thursday, October 25, 2018 - 23:15

ఏన్ ఈవెనింగ్ విత్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు అనే పేరుతో మ‌హేష్‌బాబుని క‌లుసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తామంటూ ఒక సంస్థ ఒక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసింది. అక్టోబ‌ర్ 27న న్యూయార్క్ న‌గ‌రంలో ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వ‌హిస్తామ‌ని గ‌త రెండు నెల‌లుగా చాలా ప్ర‌చారం చేశారు. టికెట్ సేల్స్ కూడా కండ‌క్ట్ చేశారు. కానీ తీరా టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డ్డాక‌, క్యాన్సిల్ చేశారు.

వేదిక‌, సెక్యురిటీ అంశాల‌ కార‌ణంగా అక్టోబ‌ర్ 27న నిర్వ‌హించాల‌నుకున్న ఈవెంట్‌ని వేరే తేదీకి వాయిదా వేస్తున్నాం. టికెట్లు కొన్న వారికి తిరిగి డ‌బ్బు చెల్లిస్తామ‌ని రిత్విక్ క్రియేష‌న్స్ సంస్థ ప్రెస్‌నోట్ పంపింది. 

చారిటీ కోసం మ‌హేష్‌బాబు ఈ ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశాడు. ఐతే ఎన్నారైల నుంచి దీనికి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. టికెట్ అమ్మ‌కాలు అంత‌గా సాగ‌లేదు. దాంతో చేసేదేమీ లేక వాయిదా వేశారు. అయితే కొత్త డేట్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అంటే ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం అమెరికాలో మ‌హ‌ర్షి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. నెల రోజుల పాటు షూటింగ్ అక్క‌డే. 

ఇటీవ‌ల అమెరికాలో ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాల‌కి అంత‌గా స్పంద‌న రావ‌డం లేదు. సినిమా స్టార్స్ వ‌స్తున్నార‌ని చెప్పి భారీగా దోచుకుంటున్నార‌నే అభిప్రాయం ఎన్నారైల్లో ప‌డింది. అందుకే భారీ మొత్తంలో టికెట్ రేట్లు పెడితే..తూచ్ అని చెప్పేస్తున్నారు.