50 పాత్ర‌లు, వంద‌ల‌ కోట్లు....మ‌ణి సినిమా

Mani Ratnam's next will be an epic tale with fifty characters
Tuesday, July 9, 2019 - 20:15

మ‌ణిర‌త్నం కొత్త సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. త‌మిళ సాహిత్యంలో ఏంతో పేరున్న "పొన్నియ‌న్ సెల్వ‌న్" అనే న‌వలని తెర‌కిక్కిస్తున్నారు మ‌ణిర‌త్నం. ఇది చారిత్రిక చిత్రం. చోళుల గాథ‌. రాజ‌రాజ‌న్ చోళ‌న్ ....తమిళ‌నాడు వైభ‌వానికి ప్ర‌తీక‌. నేడు త‌మిళ‌నాడులో ఉన్న గొప్ప గుళ్ల‌న్నీ ఆయ‌న క‌ట్టించిన‌వే. 

ఐతే ఈ క‌థ‌లో ఎంతో డ్రామా ఉంది. ప‌ద‌వీ కోసం ప‌డే పాట్లు, ప‌ద‌వీ నుంచి దింపేందుకు ప్ర‌త్య‌ర్థులు వేసే వ్యూహాలు, ప్రేమ‌లు, పెళ్లిళ్లు... ఇలా అన్ని అంశాల్లోనూ ఎంతో నాట‌కీయ‌త ఉంది ఆ న‌వ‌ల‌లో. ఐతే ప్ర‌ధాన పాత్ర‌లు ఎక్కువ‌. క‌థ‌కి ఉన్న స్కోప్ కూడా చాలా పెద్ద‌ది. అందుకే ఆనాటి ఎమ్జీఆర్ నుంచి ప‌లువురు త‌మిళ ద‌ర్శ‌కులు, హీరోలు ఈ న‌వ‌ల‌ని తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నించి త‌మవ‌ల్ల కాద‌ని చేతులెత్తేశారు. మ‌ణిర‌త్నం కూడా దాదాపు ప‌దేళ్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ సెట్ అయింది. 

విక్ర‌మ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. విక్ర‌మ్‌, కార్తీ, ఐశ్వ‌ర్యారాయ్‌, మోహ‌న్‌బాబు, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌యం ర‌వి,  కీర్తి సురేష్ ఇలా ప‌లువురు న‌టులు ఓకే అయ్యారు. ఐతే ఈ సినిమాలో ప్ర‌ధానంగా 50 పాత్ర‌లుంటాయట‌. ఈ 50 కీల‌క‌మైన‌వే. అంటే 50 మంది న‌టులు కూడా కావాలి. అలాగే ఈ సినిమాని తీయాలంటే మినిమం 200 కోట్లు కావాలి. మ‌ణిర‌త్నంతో 200 కోట్లు అంటే పెద్ద రిస్క్‌. రాజ‌మౌళిలా మ‌ణిర‌త్నం సినిమాల‌కి క‌మ‌ర్షియ‌ల్‌గా అంత మార్కెట్ లేదు. ఐనా రిస్క్ తీసుకుంటున్నాడు ఈ గ్రేట్ డైర‌క్ట‌ర్‌.