చిరుకి మ‌ళ్లీ క‌మ‌లం గాలం

Megastar and BJP, rumors galore
Tuesday, June 25, 2019 - 15:30

మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదు. రాజ‌కీయ నాయ‌కుడిగా స‌క్సెస్ కాలేక‌పోయిన మెగాస్టార్ త‌న మానాన తాను మ‌ళ్లీ న‌టిస్తూ హాయిగా అందరివాడు అనిపించుకుందామ‌నుకుంటే ఆయ‌న్ని నిదానంగా ఉండ‌నిచ్చేలా లేదు క‌మ‌లం పార్టీ. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్టారు. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో...వెండితెరపై మెగాస్టార్ మెగాస్టారే అన్న‌ది ప్రూవ్ అయింది. ఆ ఆనందంతోనే ఆయ‌న 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో సైరా సినిమాని పూర్తి చేశారు. త్వ‌ర‌లో కొర‌టాల శివ సినిమా మొద‌లుపెడుతున్నారు. అంటే సినిమా రంగంలోనే కంటిన్యూ అవుదామ‌ని అంత‌గా ఫిక్స్ అయ్యారు మెగాస్టార్‌.

ఐతే.. ఏపీ, తెలంగాణ‌ల్లో పాగా వేద్దామనుకుంటున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌న్ను మెగాస్టార్‌పై ప‌డింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే మంచి ఎంట్రీ దొరికింది. కొంత‌మంది రెడ్డి నాయ‌కుల‌ను లాగేందుకు స్కెచ్ రెడీ చేసింది. ఏపీ విష‌యానికొస్తే...అక్క‌డ పెద్ద‌గా పురోగ‌తి లేదు. అసెంబ్లీలోనూ, లోక్‌స‌భ‌లోనూ ఏపీలో రెప్ర‌జెంటేష‌న్ లేదు. ఈ టైమ్‌లో అక్క‌డ పార్టీకి ఒక చ‌రిష్మటిక్ ఫేస్ కావాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

త‌మ్ముడు జ‌న‌సేన పార్టీతో ఉండడంతో అన్న‌య్య చిరంజీవిని త‌మ పార్టీలోకి లాగాల‌ని క‌మ‌లం పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. మ‌రి చిరంజీవి ఒప్పుకుంటాడా? పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిస్తే మీరే సీఎం అవుతార‌ని ఆశ‌చూపినా...మెగాస్టార్ సై అంటాడా? వేచి చూడాలి.