చెక్‌బౌన్స్ కేసులో మోహ‌న్‌బాబుకి శిక్ష‌

Mohan Babu gets shock in Cheque bounce case
Tuesday, April 2, 2019 - 13:30

ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌బాబుకి కోర్టులో చుక్కెదురు అయింది. ప‌దేళ్ల క్రితం వైవిఎస్ చౌద‌రి వేసిన కేసులో మోహ‌న్‌బాబు వాద‌న చెల్ల‌లేదు. కోర్టు మోహ‌న్‌బాబుకి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.

2009లో చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్‌బాబు "స‌లీమ్" అనే సినిమాని నిర్మించారు. పారితోషికంలో భాగంగా చౌద‌రి తీసుకున్న చెక్ బౌన్స్ అయింది. త‌న పారితోషికం చెల్లించాల‌ని వైవిఎస్ ఎంత కోరినా మోహ‌న్‌బాబు చెల్లించ‌లేదు. చెప్పిన బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువ ఖ‌ర్చుపెట్ట‌డమే కాకుండా సినిమాని అట్ట‌ర్‌ఫ్లాప్ చేసినందుకు తిరిగి నాకే చెల్లించాల‌ని మోహ‌న్‌బాబు అన్నారు. దాంతో వైవిఎస్ కోర్టుని సంప్ర‌తించారు. ఆ కేసు తుది తీర్పు ఇపుడు వ‌చ్చింది.

చౌద‌రికి రూ.41.75 ల‌క్ష‌లు చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది హైద‌రాబాద్‌లోని ఎర్రుం మంజిల్ కోర్టు. మోహ‌న్‌బాబు ఈ కేసులో దోషి అని చెప్పింది కోర్టు. ఐతే మోహ‌న్‌బాబు వెంట‌నే బెయిల్‌కి అప్ల‌యి చేసి.. బెయ‌ల్ అందుకున్నారు. కానీ ఆ డ‌బ్బు మాత్రం వైవిఎస్‌కి చెల్లించాల్సిందే.