వైట్ల..ఇంకా కావాలా నోట్లు!

Mythri is serious with Vaitla
Friday, November 23, 2018 - 17:00

"అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ"తో శ్రీను వైట్ల ఖాతాలో నాలుగో ఫ్లాప్ వ‌చ్చి చేరింది. ఒక‌ప్పుడు హిట్ మీద హిట్ అందించి అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో చేరిన వైట్ల‌...ఇపుడు ఫ్లాప్‌ల‌కి కేరాఫ్‌గా మారారు. ఐతే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతోనైనా త‌న పంథాని మార్చుకుంటాడ‌ని అంతా భావించారు. విచిత్రంగా ఈ సినిమానే అన్నింటి క‌న్నా అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. వైట్ల ఈ సినిమాని ఆ బ్యాన‌ర్‌కి ప్యాకేజీ ప‌ద్ద‌తిలో చేశాడు. 25 కోట్ల రూపాయ‌ల‌కి మొత్తం సినిమాని చేసి ఆ బ్యాన‌ర్‌కి ఇవ్వాల‌నేది ఒప్పందం. అన్న‌ట్లుగానే ప్యాకేజీలో తీశాడు వైట్ల. నిర్మాత‌లు ఈ సినిమాపై మంచి బిజినెస్ జ‌రుపుకున్నారు. దాంతో సినిమా విడుద‌లైన త‌ర్వాత త‌న‌కి రావాల్సిన ఎమౌంట్‌ని ఇవ్వాల‌ని మైత్రీ వారికి వైట్ల ఫోన్ చేశాడట‌.

ఐతే మైత్రీ నిర్మాత‌లు వైట్ల‌పై సీరియ‌స్ అయ్య‌రాట‌. త‌మ సంస్థ పేరుని చెడ‌గొట్టిందే కాకుండా ఇంకా ఇపుడు డ‌బ్బులు కావాల‌ని అడుగుతున్నారా అని వారు మండిప‌డ్డార‌ట‌. వైట్ల ఇంకా నీకు ఇంకా నోట్లు కావాలా అని ముఖం మీదే క‌డిగేశార‌ట‌.