ఒక్క ట్వీట్ తో బయటకొచ్చిన ఫ్లాపులు

Nag Ashwin's tweet sparks off debate
Friday, September 6, 2019 - 22:30

కొన్ని సినిమాలంతే. థియేటర్ల నుంచి బయటకెళ్లిపోయిన తర్వాత హిట్ అవుతాయి. టీవీల్లో భయంకరమైన టీఆర్పీలు వస్తాయి. తర్వాత అంతా మాట్లాడుకుంటారు. థియేటర్లలో మాత్రం అవి ఫ్లాపులే. అలాంటి ఫ్లాపులు కొన్ని టాలీవుడ్ లో కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. పెద్ద చర్చకు దారితీశాయి. ఇదంతా దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వల్ల వచ్చింది.

ఖలేజా, లీడర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయితే చూడాలనుకున్నానని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. మరీ ముఖ్యంగా ఖలేజా సినిమా హిట్ అయితే త్రివిక్రమ్ రైటింగ్ పవర్ అందరికీ తెలిసొచ్చేదనే అర్థంతో ట్వీటాడు. దీంతో ఈ ట్వీట్ పై భారీ స్థాయిలో డిస్కషన్ జరిగింది.

ఖలేజాను ది బెస్ట్ మూవీగా చాలామంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పంజా, ఆరెంజ్ సినిమాలపై ఎక్కువ చర్చ జరిగింది. పంజా సినిమా అప్పుడు ఫ్లాప్ అయినా ఇప్పుడు క్లాసిక్ అని అంతా చెప్పుకొచ్చారు. అయితే నాగ్ అశ్విన్ ట్వీట్ లో డియర్ కామ్రేడ్ మాత్రం లిస్ట్ లోకి రాదన్నారు చాలామంది.

మరికొంతమంది గతంలో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా ఫ్లాప్ అయిందని, ప్రస్తుతం క్లాసిక్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు. దీంతో తన ట్వీట్ కు కొనసాగింపుగా ఆపద్బాంధవుడు చిత్రాన్ని తన ఆల్ టైమ్ ఫేవరెట్ గా చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. ఇలా నాగ్ అశ్విన్ పెట్టిన ఒకే ఒక్క ట్వీట్ తో చాలా ఫ్లాప్ సినిమాలు ఒక్కసారిగా బయటకొచ్చాయి.