కొడుకు కోసం మ‌నీ తీస్తున్న నాగ్‌?

Nag to invest in Akhil's fourth film as well?
Friday, May 3, 2019 - 11:45

అఖిల్ కెరియ‌ర్‌లో ఏ గ్రోత్ లేదు. మొద‌టి సినిమా 40 కోట్ల‌కి వ్యాపారం చేస్తే... మూడో సినిమా 20 కోట్ల‌కి జారింది. అంటే అఖిల్ మార్కెట్, ఆయ‌న సినిమాలకి విలోమానుపాతంలో సాగింద‌న్న‌మాట‌. 

ఇపుడు నాలుగో చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మించేందుకు ముందుకువ‌చ్చారు. జీఏ2 బ్యాన‌ర్‌పై బ‌న్నివాస్‌తో ఈ సినిమాని తీయిస్తున్నారు అర‌వింద్‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైర‌క్ష‌న్‌లో మూవీ.

ఈ నెల‌లోనే మూవీని లాంచ్ చేయ‌నున్నారు. ఐతే సినిమాని లిమిటెడ్ బడ్జెట్‌లో తీయ‌డం జీఏ2 బ్యాన‌ర్ పాల‌సీ. నానితో "భ‌లే భ‌లే మ‌గాడివోయి" కానీ, నాగ చైత‌న్య‌తో "100 ప‌ర్సెంట్ ల‌వ్" కానీ, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో "గీత‌గోవిందం" కానీ అన్నీ మీడియం బ‌డ్జెట్‌తో సినిమా తీసి విజ‌యం సాధించింది ఆ సంస్థ‌. ఐతే ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి హిట్‌లు లేక‌పోవ‌డం, అఖిల్‌కి మార్కెట్ లేని కార‌ణంగా మ‌రింత త‌క్కువ బ‌డ్జెట్‌లో తీయాల‌నుకుంటున్నార‌ట‌.

ఈ విష‌యం తెలుసుకున్న నాగార్జున‌... ఇపుడు త‌ను కొంత ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాడ‌ట‌. అంటే కొడుకు సినిమా మ‌రీ లోబ‌డ్జెట్‌లో తీయ‌కుండా గౌర‌వ‌ప్ర‌ద‌మైన రేంజ్‌లోనే తీయండ‌ని నాగ్ అర‌వింద్‌కి చెపుతున్నాడ‌న్న‌మాట‌.