నాగ్ చెప్పిన బిగ్ బాస్ ముచ్చట్లు

Nag responds about Bigg Boss 3
Thursday, July 25, 2019 - 21:45

ఓవైపు బిగ్ బాస్-3, మరోవైపు మన్మథుడు-2 రిలీజ్.. ఈ రెండు భారీ కార్యక్రమాల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు నాగ్. మన్మథుడు-2 ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగ్.. తొలిసారి బిగ్ బాస్-3 పై స్పందించాడు. షోకు సంబంధించిన విశేషాలు ఆయన మాటల్లోనే..
 

"బిగ్ బాస్ చాలా బాగుంది. మంచి అనుభూతి. మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినప్పుడు కాస్త బిగుసుకుపోయాను. సూట్, కోటు వేసుకొని అలా కూర్చోని మాట్లాడాల్సి వచ్చింది. కానీ బిగ్ బాస్ లో అంతా ఓపెన్ గా ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు, ఎట్నుంచి ఎటైనా తిరగొచ్చు. ప్రస్తుతానికైతే బాగుంది. ఒక వీకెండే కదా అయింది. చూద్దాం.. నాక్కూడా కొత్తగా ఉంది." 

బిగ్‌బాస్ మొద‌టి రెండు సీజ‌న్‌ల విష‌యాల్లో జ‌ర‌గ‌ని ర‌చ్చ ఈసారి జ‌రిగింది. దానికి కార‌ణం...ఈ షోలో అవ‌కాశం పొంద‌ని ఇద్ద‌రు హీరోయిన్లు నిరాధార ఆరోప‌ణ‌లు చేశారు. ఆ కేసు ప్ర‌స్తుతం కోర్టులో న‌డుస్తోంది. ఈ షోలో పాల్గొన‌ద్ద‌ని కొంద‌రు అభిమానులు నాగార్జున‌ని కోరారు. ఇంటిముందు ధ‌ర్నా చేసేందుకు ప్ర‌య‌త్నించారు. 

 

"హౌజ్ లో ఉండే వాళ్లు నిజంగా గ్రేట్. నేను అటు (అన్నపూర్ణ స్టుడియోస్) వైపు వెళ్లినప్పుడల్లా అలా చూస్తుంటాను. పాపం, హౌజ్ లో వాళ్లు ఏం చేస్తున్నారో అనుకుంటాను. వివాదాలకు నేను దూరం. బిగ్ బాస్ అనేది వివాదాలతో కూడుకున్నది. కానీ నేను మాత్రం ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది బిగ్ బాస్. చాలా భాషల్లో ఇప్పటికే ఎన్నో సీజన్స్ నడిచాయి. కాంట్రవర్సీని గాల్లోంచి కూడా పుట్టించొచ్చు. హైకోర్టు, తెలంగాణ పోలీసు ఈ విషయంలో బాగా పనిచేస్తున్నారు. వాళ్ల డ్యూటీ వాళ్లు బాగా చేస్తారని నమ్ముతున్నాను. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పగలను." 
 

ఈ షోలో ఎవ‌రు కాంటెస్టెంట్‌లు పాల్గొంటున్నార‌నే విష‌యం నాగార్జున‌కి ముందు తెలియ‌ద‌ట‌. అలాగే ఎవ‌రు మొద‌ట ఎలిమినేట్ అవుతార‌నేది కూడా తాను చెప్ప‌లేనంటంటున్నాడు.

"బిగ్ బాస్-3లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరనేది నేను చెప్పకూడదు. మీకో విషయం తెలుసా. బిగ్ బాస్ కంటెస్టంట్లను కూడా నాకు షోకు 5 నిమిషాల ముందు మాత్రమే చెప్పారు. బ్యాక్ రూమ్ కు తీసుకెళ్లి వీడియో చూపించారు. నాకు తెలియని వ్యక్తుల గురించి అక్కడికక్కడే బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ విషయం చెబితే ఇంట్లో కూడా నమ్మలేదు. మీరు కూడా నమ్మరని నాకు తెలుసు. కానీ ఇదే నిజం."