యుద్ధం ప్రకటించిన నాగ బాబు

Naga Babu declares war on Jabarasth
Tuesday, December 24, 2019 - 17:15

అనుకున్నంతా అయింది. మొన్నటివరకు జబర్దస్ట్ ప్రొగ్రామ్ ను నాగబాబు రెచ్చగొట్టారు. ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ జనాలే నాగబాబును రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. దీంతో అఫీషియల్ వార్ మొదలైనట్టయింది. ఈటీవీలో ప్రసారమౌతున్న జబర్దస్త్ కు జీతెలుగులో తాజాగా ప్రారంభమైన అదిరింది అనే కార్యక్రమానికి ఇప్పుడు అధికారిక యుద్ధం మొదలైంది.

మొన్న ఆదివారం అదిరింది కార్యక్రమం ఫస్ట్ ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. అదే టైమ్ లో ఈటీవీ వాళ్లు కావాలనే జబర్దస్త్ పాత ఎపిసోడ్లను తీసి దానికి పోటీగా వేశారు. దీంతో నాగబాబుకు మండింది. ఈ వ్యవహారంపై ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేసిన నాగబాబు.. తాము జబర్దస్త్ కు పోటీగా రావాలని అనుకోలేదని, కానీ తమ కార్యక్రమానికి పోటీగా వాళ్లు జబర్దస్త్ పాత ఎపిసోడ్స్ వేయడంతో కయ్యానికి కాలుదువ్వారని ఆరోపించారు.

ఇక్కడితో ఆగకుండా.. జబర్దస్త్ ప్రసారమయ్యే అసలైన స్లాట్స్ లోనే ఇకపై అదిరింది కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు జీ తెలుగు యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఒరిజినల్ జబర్దస్త్ కు పోటీగా అదిరింది ప్రొగ్రామ్ వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు.

ఈ పోటీని ఇక్కడితో ఆపలేదు నాగబాబు. జబర్దస్త్ ఎపిసోడ్స్ కు యూట్యూబ్ లో మంచి ఆదరణ ఉంది. దాన్ని కొల్లగొట్టేందుకు అదిరింది ఎపిసోడ్లను కూడా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నిజానికి జీ తెలుగు కార్యక్రమాలేవీ యూట్యూబ్ లో ఉండవు, వాళ్లకంటూ జీ5 అనే యాప్ ఉంది. అన్నీ అందులోనే పెడతారు. కానీ కేవలం జబర్దస్త్ కు పోటీ ఇవ్వడం కోసం అదిరింది ప్రొగ్రామ్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. సో.. పోటీ ఇప్పుడు అధికారికం అయిందన్నమాట. జబర్దస్త్ ను అదిరింది కార్యక్రమం ఎన్ని వారాల్లో అధిగమిస్తుందో చూడాలి.