త‌మ్ముడు న‌న్ను పిల‌వ‌డు: నాగ‌బాబు

Naga Babu gives clarity on entry into Jana Sena
Monday, February 11, 2019 - 14:00

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌స్తుతం ఒంటరి పోరు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆయ‌న తెలుగుదేశంతో పార్టీ పెట్టుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. దానికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హారం ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు చంద్ర‌బాబునాయుడుని, లోకేష్‌ని, బాల‌య్య‌ని, సీబీఎన్ ఛానెల్ అనిపించుకుంటున్న ఏబీఎన్‌ని.. టార్గెట్ చేస్తూ నిత్యం యూట్యూబ్‌లో వాయిస్తున్నాడు. అన్న‌య్య ఇంత‌గా టీడీపీని ట్రోల్ చేస్తున్న‌పుడు త‌మ్ముడు అదే పార్టీతో చేతులు క‌లుపుతాడ‌ని ప్ర‌చారం చేయ‌డం అసంబంద్దంగా లేదూ!

ఆ మేట‌ర్ ప‌క్క‌న పెడితే.. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ని జ‌న‌సేన పార్టీలోకి ఆహ్వాంచ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు నాగ‌బాబు. ఐతే ఆహ్వానించ‌క‌పోయినా జ‌న‌సేన‌ తరపున ప్రచారం చేస్తానంటున్నారు నాగబాబు.

"నేను జనసేన పార్టీ అభిమానిని.. ఆ పార్టీ గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. జనసేన పార్టీకి నా మద్దతు లేదని ఎలా అనుకుంటారు. తప్పకుండా ఉంటుంది.అంతెందుకు ఈ మధ్యనే మా అబ్బాయి, నేను కలిసి కోటీ పాతిక లక్షలు జనసేన పార్టీకి డొనేట్ చేశాం క‌దా," అని వివ‌ర‌ణ ఇచ్చారు నాగ‌బాబు.

ఐతే పార్టీలో చేర‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఎందుకంటే.. జ‌న‌సేన‌ని ఒక ఫ్యామిలీ పార్టీగా మార్చ‌కూడ‌ద‌నేది ప‌వ‌న్ కల్యాణ్ ఆలోచ‌న‌. ప్ర‌జారాజ్యం పార్టీ విష‌యంలో అదే పెద్ద స‌మ‌స్య అయింది. అదే త‌ప్పును ఇపుడు చేయ‌కూడ‌ద‌నేది ప‌వ‌న్ థాట్‌. ఆ ఆలోచ‌న‌కి త‌గ్గ‌ట్లుగానే మెగా ఫ్యామిలీ దూరంగా ఉంటుంది. ఐతే మ‌ద్ద‌తు, ప్ర‌చారం మాత్రం ఉంటుంది.