క‌లిసి ప్ర‌మోష‌న్ చేస్తారా?

Naga Chaitanya and Samantha to promote together?
Thursday, August 30, 2018 - 22:45

నాగ చైత‌న్య‌తో పోటీ కాదు, నాగ చైత‌న్య‌తో క‌లిసి వ‌స్తున్నా అని అడిగిన వాళ్ల‌కి, అడ‌గ‌ని వాళ్ల‌కి చెపుతోంది స‌మంత‌. చైత‌న్య నటించిన "శైల‌జారెడ్డి అల్లుడు", స‌మంత తొలిసారిగా యాక్ట్ చేసిన థ్రిల్ల‌ర్ "యూట‌ర్న్" ఒకే రోజు విడుద‌ల కానున్నాయి. సెప్టెంబ‌ర్ 13న ఈ రెండు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఒక‌రోజు రిలీజ్ అవుతున్నాయి కాబ‌ట్టి భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ పోటీప‌డుతున్నార‌ని అంద‌రూ కామెంట్ చేస్తున్నారు. దాంతో చైత‌న్య వెర్సెస్ స‌మంత కాదు స‌మంత విత్ చైత‌న్య అని అనండి అని చెపుతోంది. 

విన‌డానికి ఇది బాగానే ఉంది. మ‌రి ఇద్ద‌రూ త‌మ సినిమాల‌ని క‌లిసి ప్ర‌మోట్ చేస్తారా?

"శైల‌జారెడ్డి అల్లుడు" సినిమాని చైత‌న్య త‌న పంథాలో తాను ప్ర‌మోట్ చేసుకుంటాడ‌ట. స‌మంత యూట‌ర్న్" ని ప్ర‌మోట్ చేసుకుంటుంది. ఈవెంట్స్ ప‌రంగా, ఇంట‌ర్వ్యూల ప‌రంగా ఇద్ద‌రూ ఎవ‌రి సినిమాల‌ను వారు ప్ర‌మోట్ చేసుకుంటారు. ఐతే సోష‌ల్ మీడియాలో మాత్రం ఇద్ద‌రూ ఇరువురి సినిమాల‌కి సంబంధించిన ట్ర‌యిల‌ర్‌లు, పొగ‌డ్త‌లు షేర్ చేస్తూ హంగామా చేస్తార‌ట‌. అలా చైత‌న్య విత్ స‌మంత హంగామా కొన‌సాగ‌నుంది.

నిజానికి వీరిద్ద‌రి సినిమాలు ఒకేరోజు విడుద‌ల కావ‌డం అనేది యాదృచ్చికంగా జ‌రుగుతోంది. కేర‌ళ వ‌ర‌దల కార‌ణంగా సంగీత ద‌ర్శ‌కుడు గోపిసుంద‌ర్ టైమ్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌లేక‌పోయాడు దాంతో ఆగ‌స్ట్ 31న విడుద‌ల కావాల్సిన శైల‌జారెడ్డి అల్లుడు సెప్టెంబ‌ర్ 13కి వాయిదాప‌డాల్సి వ‌చ్చింది. "యూట‌ర్న్"  సినిమాని తెలుగుతో పాటు త‌మిళంలో విడుద‌ల చేస్తున్నారు. త‌మిళంలో సెప్టెంబ‌ర్ 13కి మంచి రిలీజ్‌ విండో దొరికింది. అందుకే త‌న సినిమాని స‌మంత వాయిదా వేసుకోలేక‌పోయింది. రెండు వేర్వేరు జాన‌ర్ మూవీస్ కాబ‌ట్టి పోటీ ఉండ‌ద‌నేది వారి అభిప్రాయం.