ప్రచారంలో నాగ శౌర్య టచ్

Naga Shaurya and Tattoo publicity
Saturday, December 21, 2019 - 18:45

ప్రచారంలో చాలా రకాలున్నాయి. మనది కాస్త ట్రెడిషనల్ గా సాగుతోంది కానీ, బాలీవుడ్ జనాల ప్రచారమైతే చాలా వినూత్నంగా ఉంటుంది. దాదాపు ఆ ఫార్మాట్ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో నాగశౌర్య. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఈ హీరో ఏకంగా తన ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.

అవును.. ఇంగ్లిష్ లో అశ్వథ్థామ అనే టైటిల్ ను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు శౌర్య. కనిపించీ కనిపించనట్టు అది కొద్దికొద్దిగా పైకి కనిపిస్తోంది. బహుశా సినిమాలో ఇది పూర్తిగా కనిపిస్తుందేమో చూడాలి. ఎందుకంటే, ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లోకి మారాడు శౌర్య. షర్ట్ లేకుండా 2-3 షాట్స్ కూడా ఉన్నాయి. ఆ టైమ్ లో ఈ పచ్చబొట్టు కనిపించే అవకాశం ఉందంటున్నారు.

మరికొందరు మాత్రం ఇది సినిమా కోసం వేయించుకున్న పచ్చబొట్టు కాదని, సెంటిమెంట్ కొద్దీ శౌర్య ఈ పని చేశాడని అంటున్నారు. ఎందుకంటే, తొలిసారిగా ఈ సినిమాకు కథ అందించాడు శౌర్య. టైటిల్స్ లో అతడి పేరే పడుతుంది. దీంతో పాటు డైరక్షన్, డైలాగ్స్ లో కూడా అతడు కాస్త ఎక్కువగానే చొరబడ్డాడని టాక్. పైగా ఇది అతడి సొంత బ్యానర్ సినిమా.

అందుకే కాస్త ఎమోషనల్ గా ఫీలై ఆ టాటూ వేయించుకొని ఉంటాడంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ, అది పర్మనెంట్ టాటూనా, కొన్నాళ్ల తర్వాత చెరిగిపోయే పచ్చబొట్టా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.