నిర్మాత ఓడిపోవ‌డం హీరోకి క‌లిసొచ్చింది

Naga Shourya relieved with his producer's flop show
Tuesday, February 5, 2019 - 16:00

నాగ‌శౌర్య సినిమాని ఆ నిర్మాత మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు. ఎన్నిక‌ల ఖ‌ర్చుకి డ‌బ్బులు కావాల్సి ఉంటుంద‌ని ఒక షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత సినిమాని ప‌క్క‌న పెట్టాడు నిర్మాత ఆనంద ప్ర‌సాద్‌. అప్ప‌టికే న‌ర్త‌న‌శాల అట్ట‌ర్‌ఫ్లాప్‌లో ఉన్న నాగ‌శౌర్య‌కి అది షాక్‌లా త‌గిలింది. న‌ర్త‌న‌శాల ఫ్లాప్ కావడం వ‌ల్లే ఆనంద ప్ర‌సాద్ భ‌య‌ప‌డిపోయి సినిమాని మిడిల్‌డ్రాప్ చేశాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఐతే నాగ‌శౌర్య‌కి ఎక్క‌డో ల‌క్‌ ఉంది. ఈ సినిమా మ‌ళ్లీ మొద‌లు కానుంద‌ట‌.

ఆనంద్ ప్ర‌సాద్ మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి నియోజక‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచి ఓడిపోయాడు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారు అధికంగా ఉన్న నియోజక‌వ‌ర్గం అది అని ఏవో కాకిలెక్క‌లు వేసుకొని బ‌రిలో నిలిస్తే తెలంగాణ ఓటరు ఇక్క‌డ కులరాజ‌కీయాల‌కి చోటు ఉండ‌ద‌ని గట్టిగా తీర్పు ఇచ్చారు. ఓట‌మితో పాటు కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకున్నారు ఆనంద్ ప్ర‌సాద్‌.

ఇపుడు చేసేదేమీ లేక మ‌ళ్లీ నాగ‌శౌర్య‌కి ఫోన్ చేసి సినిమా స్టార్ట్ చేద్దామ‌ని కోరాడ‌ట‌. కొత్త ద‌ర్శ‌కుడు రాజు కొలుసు రూపొందిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అలా త‌న నిర్మాత ఓడిపోవడం నాగ‌శౌర్య‌కి క‌లిసొచ్చింది. ఓట‌మే సౌఖ్య‌మ‌నే భావ‌న రానీవోయి..ఆ ఎరుకే నిత్యాన‌నందమోయి అని శౌర్య సాంగేసుకుంటున్నాడు.