శాపంలా వెంటాడుతున్న ఆక్సిడెంట్స్‌

Nandamuri families are haunted by road accidents
Wednesday, August 29, 2018 - 16:00

నంద‌మూరి కుటుంబాన్ని రోడ్డు ప్ర‌మాదాలు శాపంలా వెంటాడుతున్నాయి. హ‌రికృష్ణ కుటుంబంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఘోర ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఇందులో హ‌రికృష్ణ‌, ఆయ‌న కుమారుడు జాన‌కీరామ్ చ‌నిపోయారు. మ‌రో రోడ్డు ప్ర‌మాదంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

2009లో తెలుగు దేశం పార్టీ త‌రఫున ప్ర‌చారం పూర్తి చేసుకొని ఖ‌మ్మం నుంచి హైద‌రాబాద్‌కి వ‌స్తుండ‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌డుపుతున్న కారు ప్ర‌మాదానికి గురైంది. సూర్య‌పేట‌కి స‌మీపంలో జ‌రిగిన ఈ ఘోర ప్ర‌మాదంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. కొద్ది రోజుల చికిత్స అనంత‌రం జూ.ఎన్టీఆర్ కోలుకున్నాడు. ఇక 2014లో హ‌రికృష్ణ మ‌రో కుమారుడు జాన‌కీరామ్ విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా న‌ల్గొండ జిల్లా ఆకుపాముల గ్రామం వ‌ద్ద ఒక ట్రాక్ట‌ర్‌ని ఢీకొన్నాడు. ఆ ప్ర‌మాదంలో జాన‌కీరామ్ అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచారు.

ఇపుడు హ‌రికృష్ణ కూడా అదే రోడ్డులో రోడ్డు ప్ర‌మాదానికి గురై క‌న్ను మూశారు. హైద‌రాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండ‌గా బుధ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల సమీపంలో నల్గొండ‌కి స‌మీపంలోని ఓ గ్రామం వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు హ‌రికృష్ణ‌. స్పీడ్‌గా వెళ్ల‌డమే ప్ర‌మాదానికి కార‌ణం.

అలాగే స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు సోద‌రుడు త్రివిక్ర‌మ్ రావు కుమారుడు, ఆయ‌న మ‌న‌వ‌డు కూడా ఇలాంటి వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లోనే మ‌ర‌ణించారు. ఎన్టీ రామారావు తండ్రి మ‌ర‌ణం కూడా ఇలాగే జ‌రిగింద‌ట‌. అలాగే మ‌రో ఇద్ద‌రు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు కూడా రోడ్డు ప్ర‌మాదంలోనే మ‌ర‌ణించార‌ట‌. మొత్త‌మ్మీద నంద‌మూరి కుటుంబంలో ప‌లువురు రోడ్డు ప్ర‌మాదాల‌కి గురి అవ‌డం అంద‌ర్నీ క‌లిచి వేస్తోంది. నంద‌మూరి కుటుంబాన్ని ఆక్సిడెంట్స్ శాపంలా మారాయి అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.