నాని త‌న రేంజ్‌ని పెంచుకోవాలి

Nani should increase his market range
Sunday, May 19, 2019 - 00:30

నాని న‌టించిన "జెర్సీ" సినిమా ర‌న్‌ని పూర్తి చేసుకొంది. క్రిటిక్స్ అంతా తెగ మెచ్చుకున్నారు. ఎందుకంటే సినిమా జెన్యూన్‌గా చాలా బాగుంది. ఐతే, ఈ సినిమాని పెద్ద హిట్‌గా మ‌లుచుకోవ‌డంలో నాని ఫెయిల్ అయ్యాడు. 

"మ‌హ‌ర్షి" సినిమాకి చాలా మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. కానీ మహేష్‌బాబు డీలాప‌డ‌లేదు. నిత్యం ఏదో ఒక హ‌డావుడి చేస్తూ సినిమా ప్ర‌మోష‌న్‌ని ర‌న్‌లో ఉంచాడు. కానీ నాని ఏదో నామ్ కే వాస్తే ప్ర‌మోష‌న్ త‌ప్ప బ‌య‌టికి రాలేదు. అంత పెద్ద రేటింగ్‌లు వ‌చ్చిన సినిమాని పెద్ద హిట్‌గా చేసుకోలేక‌పోయాడు. దానికి  పోటీలో "కాంచ‌న 3", "అవెంజ‌ర్స్" వంటి సినిమాలున్నాయ‌నేది ఒక కార‌ణం ఐతే త‌న‌వంతుగా పెద్ద‌గా క‌ష్ట‌ప‌డింది లేదనేది కూడా అంతే వాస్త‌వం.

అందుకే నాని సినిమాలు ఒక రేంజ్ మించి ఆడ‌డం లేదు. కొన్నాళ్లుగా ఆయ‌న సినిమాలు పాతిక‌, 30 కోట్ల రూపాయ‌ల మ‌ధ్యే ఊయ‌లలూగుతున్నాయి. "జెర్సీ" మొత్తం ర‌న్ పూర్త‌య్యేస‌రికి తెలంగాణ‌, ఆంధ్ర‌లో క‌లిపి 25 కోట్ల రూపాయ‌ల‌ను పొందింది. ఓవ‌ర్సీస్‌లో, రెస్టాఫ్ ఇండియాలో క‌లిపి 30 కోట్ల మార్క్‌ని దాటింది. ఈ సినిమాకి వ‌చ్చిన ప్ర‌శంస‌ల‌కి ఇది 40 కోట్ల మార్క్ దాటి ఉండాల్సింది.