ఇక నాని హాలీడే మూడ్‌!

Nani taking holiday break now
Tuesday, October 2, 2018 - 19:15

నాని బిగ్‌బాస్ షోని అద్భుతంగా ముగించాడు. టీవీ వ్యాఖ్యాత‌గా తొలి ప్ర‌య‌త్నంలోనే సూప‌ర్ సక్సెస్ అయ్యాడు. వివాదాల‌కి దూరంగా ఉండే నేచుర‌ల్ స్టార్‌పై కొంద‌రు బిగ్‌బాస్ అభిమానులు బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశారు కానీ త‌న కూల్ యాటిట్యూడ్‌తో నాని వాటికి ముందే చెక్ పెట్టాడు.

"నా జీవితంలో ఇంత‌ విద్వేషపూరితమైన సందేశాలను చూడ‌లేదు. బిగ్‌బాస్ షోని కొంద‌రు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. అందులో జ‌రిగే ప్ర‌తి ఘ‌ట‌న నాకే అంట‌గ‌ట్టారు. ఈ షో వల్ల నాకు అర్థమైంది ఏంటంటే..మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డ‌ని వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది..," ఇలా నాని త‌న బిగ్‌బాస్ షో అనుభ‌వాన్ని చెప్పుకొచ్చాడు. 

కొంద‌రు కాంటెస్టెంట్‌ల విష‌యంలో ప‌క్ష‌పాత ధోర‌ణి చూపాడంటూ కొంద‌రు హ‌డావుడి చేసినా..చివ‌రికి షో రెండో సీజ‌న్ పూర్త‌య్యేస‌రికి నాని మంచి పేరు తెచ్చ‌కున్నాడు. మూడు నెల‌ల పాటు సాగిన ఈ షోలో మెల్ల‌మెల్ల‌గా త‌న ప‌ట్టుని సాధించి..చివ‌రికి అన్ని మంచి మార్కులు వేసుకున్నాడు. ఐతే ఈ షో వ‌ల్ల త‌న‌కి బాగా ఒత్తిడికి గురైన మాట వాస్తవ‌మేన‌ని అంగీక‌రించాడు నాని.

"బాగా ప్రెష‌ర్ ఫీల‌యిన మాట వాస్త‌వ‌మే. ఇదివ‌ర‌కు ప్ర‌తి నాలుగు నెల‌ల‌కో సారి కనీసం రెండు వారాలు ఫ్యామిలీతో సంతోషంగా గడిపేవాడిని. కానీ బిగ్‌బాస్‌, దేవ‌దాస్ వ‌ల్ల ఈ సారి కుద‌ర‌లేదు. ఇక ఇపుడు హాలీడేకి వెళ్తున్నా," అని అన్నాడు నాని.