గ్యాంగ్‌లీడ‌ర్ వాయిదా ప‌డ‌లేద‌ట‌!

Nani's Gangleader to release on Aug 30
Wednesday, July 10, 2019 - 18:30

ఏ మాటాకి ఆ మాటే చెప్పాలి. నాని న‌టిస్తోన్న గ్యాంగ్‌లీడ‌ర్ మీద ఏ మాత్రం బ‌జ్ లేదు. అలాంటి సినిమా ఒక‌టి ఉంద‌ని కూడా చాలా మందికి తెలియ‌దు. అంత సైలెంట్‌గా సాగుతోంది. ఆగ‌స్ట్ 30కి విడుద‌ల అని రిలీజ్ డేట్ ఐతే చాలా కాలం క్రిత‌మే ప్ర‌క‌టించారు కానీ ఆ త‌ర్వాత చ‌డీచ‌పుడు లేదు. నిజంగా ఆగ‌స్ట్ 30కి విడుద‌ల అవుతుంద‌నుకుంటే ... ఈ పాటికి ఫ‌స్ట్‌లుక్కో, పాటో..ఏదో ఒక‌టి విడుద‌ల చేయాలి క‌దా. టీమ్ అంతా సైలెంట్‌గా ఉందంటే..ఇప్ప‌ట్లో రిలీజ్ లేద‌నే అనుకుంటారు.

అందుకే ట్రేడ్ వ‌ర్గాలు ఈ సినిమాని ఆగ‌స్ట్ విడుదల తేదీ నుంచి తీసిప‌డేశాయి. దాంతో ఇపుడు టీమ్‌... హ‌డావుడి చేస్తోంది. ఆగ‌స్ట్ 30నే వ‌స్తున్నాడు గ్యాంగ్‌లీడ‌ర్ అంటూ ట్వీట్ ఒక‌టి బ‌య‌టికొచ్చింది. ఇదే క‌న్‌ఫ‌మేష‌న్ అనుకోవాలా?

విక్ర‌మ్‌కుమార్ డైర‌క్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ...గ్యాంగ్ లీడ‌ర్‌. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌పుడే ఆస‌క్తి క‌లిగేలా ఒక టీజ‌ర్ వ‌దిలారు. అందులో నాని లేడు. ఆ త‌ర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక్క స్టిల్లు రాలేదు. న‌ల‌భై రోజుల (నిజంగా ఆగ‌స్ట్ 30కి విడుద‌లైతే) గ్యాప్‌లోనే మ‌రి ఎలా ప్ర‌మోష‌న్ చేస్తారో? 

నాని న‌టించిన జెర్సీకి ఎంతో పేరు వ‌చ్చింది. ఐనా వ‌చ్చిన క‌లెక్ష‌న్లు అంతంత‌మాత్ర‌మే. ఇలాంటి టైమ్‌లో నాని ఇంత పాసివ్‌గా ఉంటే ఇంకా ఏం పెరుగుతుంది మార్కెట్టు?