నరేష్ నన్ను అవమానించాడు: శివాజీరాజా

Naresh humiliated me, says actor Sivaji Raja
Friday, March 8, 2019 - 08:15

మా అసోషియ‌న్ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. సినిమా స్టార్స్ మ‌ధ్య ఉన్న లుకలుక‌ల‌న్నీ బ‌య‌ట‌ప‌డుతున్నాయి. శివాజీరాజా గ్రూప్‌కి, న‌రేష్ గ్రూప్‌కి అస్స‌లు ప‌డ‌ద‌నేది అందరికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. శివాజీ రాజా మా అసోషియేష‌న్ డ‌బ్బుల‌ను దుర్వినియోగ ప‌రుస్తున్నాడ‌ని ఇంత‌కుముందు న‌రేష్ మా కార్యాల‌యానికి తాళం వేసి సంచల‌నం సృష్టించాడు. ఇపుడు త్వ‌ర‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ వేరు వేరు ప్యానెల్స్ త‌ర‌ఫున పోటీలో ఉన్నారు.

గురువారం నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో శివాజీరాజా కంట‌త‌డి పెడుతూ పాత విష‌యాల‌ను ఏక‌రువు పెట్టాడు. "నరేష్ నన్ను అవమానించాడు, అధ్యక్ష పదవిని అవమానించాడు. మెగాస్టార్ చిరంజీవిని తప్పుదారి పట్టించాడు. నా బర్త్ డే రోజు నన్ను ఆఫీసులో, మా ఆవిడను గుడిలో  గంటల తరబడి నిరీక్షించేలా చేశాడు నరేష్. మా అసోసియేషన్ పరువును రోడ్డుకీడ్చాడు," అని శివాజీరాజా గ‌తంలో జ‌రిగిన విష‌యాల‌ను తెలిపాడు. 

"తాము గెలిస్తే 50 మంది నిరుపేద నటీనటులకు 6 నెలలపాటు నిత్యావసర సరుకులు అందజేస్తాం.  ఫింఛన్ 7,500 అందజేస్తాం. పేద కళాకారులకు అందుబాటులో ఉంటాన‌,"ని శివాజీరాజా ప్రామిస్ చేశాడు.