అక్కడ కూడా ఏజెంట్‌ ఆత్రేయ హిట్‌

Naveen Polishetty hits gold in Bollywood too
Tuesday, September 10, 2019 - 18:45

"ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ" సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్‌ పొలిశెట్టి. ఈ కుర్ర హీరో..తెలుగులో హీరోగా పరిచయం కాకముందే ముంబైలో చాలా ఏళ్లు నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించాడు. కొన్ని వెబ్‌ సిరీస్‌లలో నటించి పాపులర్‌ అయ్యాడు. ఏజెంట్‌ సాయిగా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్న నవీన్‌ ... ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

ఇటీవల విడుదలైన "చిచోరే" సినిమాలో అతను హీరోకి ఫ్రెండ్‌గా నటించాడు. ఈ ఏడాది మంచి ఓపెనింగ్స్‌ సాధించిన చిన్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది "చిచోరే". అంతేకాదు, ఈ సినిమా పెద్ద హిట్‌ దిశగా వెళ్తోంది. మొదటి నాలుగు రోజుల ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. 

తెలుగులోనే కాదు హిందీలోనూ మంచి గుర్తింపు రావడంతో నవీన్‌ పొలిశెట్టి ఖుషీఖుషీగా ఉన్నాడు. ఇటీవల కాలంలో టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న కుర్ర తెలుగు నటుల్లో నవీన్‌ ఒకరు. హిందీలోనూ, తెలుగులోనూ మంచి కమాండ్‌ ఉన్న యాక్టర్‌ అతను.