క్రికెట్ బ్యాట్ కాసులు కురిపిస్తుందా?

New trend: Movies with cricket theme
Friday, January 18, 2019 - 13:15

అప్పుడెప్పుడో "లగాన్" సినిమాలో అమీర్ క్రికెట్ ఆడితే కాసుల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆ సినిమా ఆణిముత్యమే. అడపాదడపా మన తెలుగు స్టార్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై క్రికెట్ బ్యాట్ తో కనిపించారు. ఇప్పుడీ ట్రెండ్ మరోసారి మొదలైనట్టు కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సినిమాలు క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.

ఇప్పుడొస్తున్న సినిమాల్లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది "జెర్సీ: సినిమానే. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని ఇందులో కనిపిస్తున్నాడు. సినిమా మొత్తం క్రికెట్ నేపథ్యమే. లేటు వయసులో క్లిక్ అయిన క్రికెటర్ కథతో ఈ సినిమా వస్తోంది.

ఈ మూవీతో పాటు "మజిలీ" అనే మరో సినిమాలో కూడా క్రికెట్ కాన్సెప్ట్ ఉంది. రియల్ లైఫ్ భార్యాభర్తలు సమంత, నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా ఇది. నిజానికి ఇందులో క్రికెట్ టచ్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ. కానీ కథాపరంగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చైతూను క్రికెటర్ గా చూపించారు. ఈ మేరకు ఓ లుక్ కూడా విడుదల చేశారు.

గీతగోవిందం జంట విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చేస్తున్న"డియర్ కామ్రేడ్" సినిమాలో కూడా క్రికెట్ ఉంది. ఇందులో రష్మిక క్రికెటర్ గా కనిపించబోతోంది. దీనికోసం ఆమె కొన్ని రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేసింది. కానీ ఇది క్రికెట్ బేస్డ్ సినిమా కాదు. సినిమాలో ఓ నేపథ్యం మాత్రమే.

ఈ మూవీస్ తో పాటు సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సందీప్ కిషన్ చేస్తున్న సినిమా కూడా క్రికెట్ కాన్సెప్ట్ తోనే వస్తోంది.

ఇలా ఒకేసారి క్రికెట్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాల్లో ఎన్ని క్లిక్ అవుతాయో ఈ ఏడాదిలోనే తేలిపోతుంది.