బ‌యోపిక్ తీస్తున్నారా? పిక్‌లు క్లిక్ చేస్తున్నారా?

NTR Biopic: Team overdriving publicity with frequent dose of picture releases
Monday, October 22, 2018 - 22:45

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావుకి అన్ని పార్టీల్లోనూ, అన్ని వ‌ర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులున్నారు. న‌టుడిగా, రాజ‌కీయ‌నాయ‌కుడిగా ఆయ‌న‌దొక చ‌రిత్ర‌. క‌థానాయ‌కుడిగానూ, మ‌హానాయ‌కుడిగానూ తెలుగునాట చెర‌గ‌ని ముద్ర‌వేసిన శ‌క్తి. అలాంటి గొప్ప న‌టుడు జీవిత చ‌రిత్ర సినిమాగా వ‌స్తుందంటే అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీ రామారావు పాత్ర‌లో బాల‌య్య‌గా బ‌యోపిక్‌ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఈ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగింది. 

ఇక విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరొందిన క్రిష్ .... ఈ సినిమాని టేక‌ప్ చేసిన త‌ర్వాత అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఆ త‌ర్వాత విడుద‌ల‌యిన ఒక్కో స్టిల్‌, ఒక్కో పోస్ట‌ర్‌... సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి ఇప్ప‌టికే ఎన‌లేని క్రేజ్‌, బ‌జ్ ఉంది. ప్రత్యేకంగా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. 

ఐతే.. ఎన్టీఆర్ బ‌యోపిక్ టీమ్ మాత్రం... త‌రుచుగా ఏదో ఒక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేయాల‌ని త‌పన ప‌డుతోంది. ప్ర‌తి వారం ఏదో ఒక స్టిల్లో, ఒక పోస్ట‌ర్‌, ఒక అప్‌డేటో వ‌స్తూనే ఉంది. కొన్నిసార్లు ఒకే రోజు రెండు మూడు బిగ్ అనౌన్స్‌మెంట్‌లు వ‌స్తున్నాయి. ఈ హ‌డావుడి మొద‌ట్లో బాగానే అనిపించినా..ఇపుడు అతిగా అనిపిస్తున్నాయి. సినిమా తీస్తున్నారా? స‌్టిల్స్, పోస్ట‌ర్స్ త‌యారు చేస్తున్నారా అని  సోష‌ల్ మీడియాలో కామెంట్‌లు ప‌డుతున్నాయి. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. రెండు భాగాలూ జ‌న‌వ‌రిలోనే రానున్నాయి. అంటే మ‌రో నాలుగు నెల‌ల పాటు ఈ హ‌డావుడి ఉంటుంది. ఎలాగూ విడుద‌ల‌కి నెల రోజుల ముందు ఇంట‌ర్వ్యూలు, ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లు, ఆడియో విడుద‌ల హంగామా త‌ప్ప‌దు. మ‌రి ఇపుడు ఎందుకు ఈ ఫోటోల ప్ర‌హ‌స‌నం..అది కూడా నిత్యం?