ఇక జూనియ‌ర్‌కి త‌ప్ప‌ట్లేదు!

NTR Jr to canvass for Nandamuri Suhasini
Monday, November 26, 2018 - 22:15

నారా చంద్ర‌బాబు నాయుడు ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి, ఆ పార్టీ క‌లాపాలకి గ‌త కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని ఈ సారి ఎన్నిక‌ల ప్ర‌చార రంగంలోకి దించాల‌ని వ్యూహం ప‌న్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు. క‌ల్యాణ్‌రామ్ కుటుంబంలో ఒక‌రికి టికెట్ వ‌స్తే జూనియ‌ర్ త‌న బెట్టుని గ‌ట్టు మీద పెట్ట‌క త‌ప్ప‌ద‌ని బాబుకి తెలుసు. తాజా స‌మాచారం ప్రకారం.. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూక‌ట్‌ప‌ల్లిలో ప్ర‌చారం చేసేందుకు అంగీక‌రించాడ‌ట‌. అంటే బాబు ప్లాన్ ఫ‌లించింది.

 కూకట్‌పల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా నంద‌మూరి హ‌రికృష్ణ కూతురు నందమూరి సుహాసిని బ‌రిలో ఉన్నారు. ఆమెకి మద్దతుగా ఒక రోజు ప్రచారం చేసేందుకు క‌ల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ అంగీక‌రించార‌ని ఆ పార్టీ నేత‌ పెద్దిరెడ్డి చెప్పారు.

సోద‌రి కోసం ప్ర‌చారానికి వ‌చ్చేందుకు క‌ల్యాణ్‌రామ్ ఇంత‌కుముందే ఒప్పుకున్నాడు. ఐతే జూనియ‌ర్ మాత్రం చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డాడు. బాబు మ‌రోసారి త‌న‌ని క‌రివేపాకులా వాడేసి వ‌దులుకుంటాడ‌నేది జూనియ‌ర్ భ‌యం. 2009లో తెలుగుదేశం పార్టీ తర‌ఫున ప్ర‌చారం చేశాడు జూనియ‌ర్‌. ఐతే అపుడు పార్టీ గెల‌వ‌లేదు. ఆ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ తాను అడిగిన వారికి ప‌ద‌వులు, సీట్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు నాయుడు అంగీక‌రించ‌లేదట‌. దాంతో తార‌క్‌..పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చాడు. ఈ విష‌యంలోనే ఇటు తార‌క్‌కి, అటు బాల‌య్య మ‌ధ్య గ్యాప్ పెరిగింది. ఐతే హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ బంధం చిగురించింది.

కుటుంబ సంబంధాల కోసం ఇపుడు జూనియ‌ర్ దిగిరాక త‌ప్ప‌డం లేద‌నేది రాజ‌కీయ ప‌రిశీలకుల మాట‌. చంద్ర‌బాబు నాయుడు ప్లాన్ వేస్తే అలాగే ఉంటుందని అంటారు. పెద్దిరెడ్డి చెపుతున్న‌ట్లుగా ఎన్టీఆర్ ఎపుడు ప్ర‌చారంలోకి దిగుతాడ‌నేది చూడాలి.