గుర్రం...తార‌క మంత్రం!

NTR undergoes horse riding training
Wednesday, June 26, 2019 - 22:30

రాజ‌మౌళి సినిమా మేకింగ్ అంటే హీరోలకి ఒక పాఠ‌శాల. ఆయ‌న సినిమాల్లో నటించాలంటే హీరోలు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది, ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సినిమాలో ఓ హీరోకి రగ్భీ నేర్పాడు. మ‌రో సినిమాలో క‌త్తి విన్యాసాలు, గుర్ర‌పు స్వారీ నేర్పాడు. ఇంకో సినిమాలో పౌరాణిక అంగిక‌, వాచికాలు నేర్పించాడు. ఒక్కో సినిమాలో ఒక్కో హీరోకి త‌ర్ఫీదు. 

ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాకి కూడా ఇప్ప‌టికే చాలా వ‌ర్క్‌షాప్‌లు జ‌రిగాయి. ఒక్కో షెడ్యూల్‌కి కొంత ట్ర‌యినింగ్ సాగుతోంది. 

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకోవ‌డం, దాన్ని మ‌చ్చిక చేసుకోవ‌డం, స్వారీ చేయ‌డం వంటి వాటితో బిజీగా ఉన్నాడు. జూనియ‌ర్‌కి హార్స్ రైడింగ్ వ‌చ్చు. కానీ ఈ సినిమాలో కీల‌క‌మైన సీన్ల‌కి మ‌రింత ప్రొఫెష‌న‌ల్‌గా నేర్చుకుంటున్నాడు. అలా గుర్రాన్ని మ‌చ్చిక చేసుకునేందుకు ఎన్టీఆర్ క‌ష్ట‌పడుతున్న ఒక వీడియో లీక్ అయింది. లీక్ అయితే వైర‌ల్ కాకుండా ఉంటుందా? అదే జ‌రిగింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా న‌టిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఫిక్ష‌న‌ల్ స్టోరీ. ఆదిలాబాద్ అడ‌వుల్లో జంగ‌ల్‌, జమీన్ అంటూ పోరాటం చేసిన కొమ‌రం భీమ్‌, రంప‌చోడ‌వ‌రం ఏజేన్సీ ప్రాంతంలో తెల్ల‌వారిని గ‌డ‌గ‌డ‌లాడించిన అల్లూరి సీతారామ‌రాజు అనుకోకుండా క‌లిస్తే... వారు త‌మ గొప్ప వీరులుగా త‌మ ప్రాంతంలో పోటీ చేయ‌డానికి కొన్నేళ్ల ముందు నార్త్ ఇండియాలో క‌లిసి ప్ర‌యాణం సాగిస్తే ... ఇది రాజ‌మౌళి ఊహ‌. పాత్ర‌లు నిజం, క‌థ నిజం కాదు. అది ఆర్‌.ఆర్‌.ఆర్ క‌థ‌.