ఓంకార్ అన్నియకి షాకిచ్చిన కాజల్

Ohmkar gets jolt from Kajal Aggarwal
Friday, July 12, 2019 - 00:45

ఓంకార్ అన్నియకి ఆల్రెడీ తమన్న ఝలక్ ఇచ్చింది. ఆ తర్వాత కాజల్ కూడా కళ్లు తేల్చేలా చేసిందిట. 

బుల్లితెరపై యాంకర్‌గా ఓంకార్ బాగా పాపులరయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా జీనియస్ అనే మూవీ తీశాడు. ఇంత ఇడియాటిక్ మూవీ మరోటి లేదని క్రిటిక్స్ తేల్చారు. జనం ఆ సినిమా థియేటరు వైపే వెళ్లలేదు. ఐనా భయపడకుండా... రాజుగారి గది అనే భయపెట్టే సినిమా తీసి విజయం అందుకున్నాడు. ఆ సిరీస్‌లో మూడో చిత్రం మొదలైంది.

రాజుగారి గది 3 సినిమాని తమన్నతో అట్టహాసంగా లాంచ్ చేశాడు ఓంకార్. కథ అదుర్స్, పాత్ర సూపర్ ఇలాంటి మాటలతో ఓపెనింగ్ రోజు తమన్న బాగానే హడావుడి చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లుగా ప్రాజెక్ట్ నుంచి ఔటయింది. దాంతో ఆమె స్థానంలో అంతే రేంజు ఉన్న హీరోయిన్ అయితే రంజుగా ఉంటుందని కాజల్ ని కలిశారు

కాజల్ కి కథ, కాకరకాయలు అక్కర్లేదు. పైసలు గట్టిగా ఇస్తే చాలు. అక్కడే ఓంకార్ అన్నియ నసిగాడట. ఆల్రెడీ తమన్న తప్పుకొంది కాబట్టి గురుడు డెస్పరేట్‌గా ఉంటాడని భావించి కాజల్ మరింత రేట్ పెంచిందట. ఐతే అన్నియా... అంత ఇచ్చుకోలేమని మళ్లీ కాజల్ ముఖం చూడట్లేదట. ఇపుడు అవికా గోర్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్.