మంచి ఇల్లు క‌ట్టుకుంటున్న ఆ ద‌ర్శ‌కుడు

Parasuram busy with the construction of his house
Sunday, March 17, 2019 - 12:15

నాకు తొంద‌రేమీ లేదు. ఇంకా ఏడాది ఐనా వేచి ఉంటాను అంటున్నాడు ద‌ర్శ‌కుడు ప‌రుశ‌రామ్‌. చిన్న‌, మీడియం హీరోల‌తో మాత్రం చేయ‌నంటున్నాడు "గీత గోవిందం" డైర‌క్ట‌ర్‌. "గీత గోవిందం" సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌యిన త‌ర్వాత బ‌న్ని, మ‌హేష్‌బాబు వంటి ప‌లువురు బ‌డా హీరోలు క‌లిసి ప‌నిచేద్దాం..ట‌చ్‌లో ఉండండ‌ని అన్నారు. ఐతే పెద్ద హీరోల‌తో వ్య‌వ‌హారం ఓ ప‌ట్టాన తేల‌దు క‌దా. అందుకే అంత పెద్ద హిట్ ఇచ్చినా.. బ‌న్ని సొంత క్యాంప్ ద‌ర్శ‌కుడికి ఓకే చెప్ప‌లేదు. వెంట‌నే ఓకే చెప్ప‌లేదు. నెక్స్ట్ ఇయ‌ర్ చూద్దామ‌న్నాడ‌ట‌.

దాంతో లేట్ అవుతోంద‌ని ఆ మ‌ధ్య నాగ చైత‌న్య‌ని ఒప్పించారు అల్లు అర‌వింద్‌. అలాగే మ‌రో ఇద్ద‌రు మీడియం హీరోల‌తోనూ చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ ప‌రుశ‌రామ్ మాత్రం ఇపుడు త‌న మ‌రో మెట్టు ఎక్కాల‌నుకుంటున్నాను అని పెద్ద హీరోల‌తోనే చేస్తాన‌ని తేల్చి చెప్పాడ‌ట‌. పెద్ద హీరోల డేట్స్ అంటే చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంద‌ని అల్లు అర‌వింద్ చెపితే...ఫ‌ర్వాలేదు సార్ తొంద‌రేమీ లేదన్నాడ‌ట‌.

దానికి కార‌ణం ఏంటంటే.. ద‌ర్శ‌కుడు ప‌రుశ‌రామ్ ఇపుడు మంచి ఇల్లు క‌ట్టుకుంటున్నాడు. "గీత‌గోవిందం" సూప‌ర్ హిట్టయిన త‌ర్వాత ఆ సినిమా లాభాల్లో నుంచి దాదాపు 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ప‌రుశ‌రామ్‌కి అందాయి. దాంతో త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు హైద‌రాబాద్‌లో మంచి ఇల్లు క‌ట్టుకుంటున్నాడు. పెద్ద హీరోల డేట్స్ దొరికే వ‌ర‌కు ఈ ఇంటి ప‌నితో బిజీగా ఉంటాడ‌ట‌.

వ‌చ్చే ఏడాది మ‌హేష్‌బాబు ఫ్రీ అయి, ప‌రుశ‌రామ్ క‌థ న‌చ్చితే ఓకే అవొచ్చు. లేదంటే ఆ టైమ్‌కి చ‌ర‌ణ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఎవ‌రైనా రాజ‌మౌళి సినిమా షూటింగ్ పూర్తి చేసి బ‌య‌టికి వ‌చ్చే ఓకే చెప్పినా..సెట్ అవొచ్చు. సో..ప‌రుశరామ్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వ‌చ్చే ఏడాదే తేలుతుంది.