ప‌వ‌న్ న్యూఏజ్ పాలిటిక్స్‌పై సెటైర్లు

Is Pawan Kalyan practicing new age politics?
Saturday, March 23, 2019 - 10:30

జ‌న‌సేన రాజ‌కీయాల్లో మార్పుని తీసుకొస్తుంది, న్యూ ఏజ్ పాలిటిక్స్ చేస్తుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెపుతూ వ‌చ్చారు. ఆ విధంగానే అభ్య‌ర్థుల‌కి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, టికెట్లు ఇచ్చారు. ఇలా స‌గ‌టు రాజ‌కీయాల‌కి దూరంగా కొత్త పంథాను కొంత చూపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. అలాగే అతి సామాన్యుల‌కి ప‌లువురికి టికెట్లు ఇచ్చి బ‌రిలో నిలిపారు. 

ఐతే ప్ర‌చారం, ప్ర‌సంగాలు మాత్రం న్యూఏజ్ పాలిటిక్స్ ప్ర‌తిబింబించ‌డం లేదు. గ‌త రెండు రోజులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌చారాల శైలిని ప‌రిశీలిస్తే.... ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ మాట అయినా మాట్లాడే రెగ్యుల‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుల‌కి భిన్నంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమీ లేరు. తెలంగాణ ఏర్ప‌డితే హైద‌రాబాద్‌కి వెళ్లాలంటే మ‌నం (ఆంధ్రా ప్ర‌జ‌లు) వీసా తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని 2009 ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడిన త‌ర‌హాలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్ప‌డి ఐదేళ్లు కావొస్తోంది. ఇంకా ఎక్క‌డా వీసా సెంట‌ర్ పెట్ట‌లేదు క‌దా!

తెలంగాణ ఏమైనా పాకిస్థానా అని అసంబ‌ద్దంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడారు. జ‌నంలో ఆవేశాన్ని ర‌గిల్చేందుకు చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు ఇలాగే మాట్లాడుతారు. కానీ న్యూ ఏజ్ పాలిటిక్స్ అని గొప్ప‌లు చెప్పుకునే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓల్డ్ స్ట‌యిల్ మాట‌లు మాట్లాడితే ఎలా అని ఇప్ప‌టికే సెటైర్లు ప‌డుతున్నాయి.

మ‌రోవైపు, సోష‌ల్ మీడియాలో తెలంగాణ వాదులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చంద్ర‌బాబు కోసం ప్యాకేజ్ పాలిటిక్స్ చేస్తున్నాడ‌ని వారు కామెంట్లు విసురుతున్నారు. గ‌తంలో తెలంగాణ ఏర్పాడ్డ‌కా 11 రోజులు అన్నం తిన‌లేదు అని చెప్పిన ప‌వ‌న్ కల్యాణ్‌ని మొన్న కొండ‌గొట్టు టెంపుల్‌కి వెళ్లిన‌పుడు ఎవ‌రైనా కొట్టారా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.