ఓటమికి భ‌య‌పడి వెన‌క్కి త‌గ్గ‌ను: జ‌న‌సేనాని

Pawan Kalyan is undeterred by electoral debacle
Saturday, June 8, 2019 - 23:00

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్..మ‌ళ్లీ సినిమాల వైపు చూపు వేస్తున్నాడ‌న్న ప్రచారం ఇక బంద్ అయింది. రాజకీయాల్లోనే ఉంటాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ పార్టీ, ఆయ‌న‌ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఐతే ఓట‌మి త‌న‌కి కొత్త కాదని, ఓట‌మికి భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గే ర‌కాన్ని కాద‌ని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పోరాట‌మే ఆయ‌న పంథా.

ఇక‌పై కార్య‌క‌ర్త‌ల‌కి అందుబాటులో ఉండేలా స‌మ‌యాన్ని ప్లాన్ చేసుకుంటాన‌ని మాటిచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటార‌ట‌.

బోయ‌పాటి డైర‌క్ష‌న్‌లో బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడ‌ని ఇటీవ‌ల బాగా ప్ర‌చారం జ‌రిగింది. బండ్ల గ‌ణేష్‌కి సినిమా లేక‌పోవ‌డం, బోయ‌పాటికి పెద్ద హీరో దొర‌క్క ఖాళీగా ఉండ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల్లో అప‌జ‌యం పాలు కావ‌డంతో ఈ ప్ర‌చారం జ‌రిగింది. ఐతే, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం మ‌ళ్లీ న‌టించాల‌నే ఆలోచ‌న‌తో లేరు. ఈ విష‌యాన్ని త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి, నేత‌లకి ఇపుడు క్లారిటీ ఇచ్చారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ గత ఎన్నిక‌ల్లో చాలా పొర‌పాట్లు చేశారు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది... తాను, త‌న పార్టీ తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకం అని ఎస్టాబ్లిష్ చేయ‌లేక‌పోవ‌డం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోక‌పోయినా.... ఆయ‌న ప్ర‌సంగాలు, కిందిస్థాయి కార్య‌క‌ర్త‌లు వ్య‌వ‌హార‌శైలితో జ‌నాలు వేరేగా అర్థం చేసుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య అన‌ధికార పొత్తు ఉంద‌ని తిర‌స్క‌రించారు. ఇపుడు ప‌వ‌న్ క‌ల్యాణ్... అధికార పార్టీ త‌ప్పుల‌ను నిర్ద్వందంగా తిప్పికొట్టేలా, తాను ఎవ‌రి ఏజెంట్ కాద‌ని నిరూపించుకునేలా దూసుకెళ్ల‌నున్నారు. 2024 టార్గెట్‌గా ఆయ‌న వ్యూహం ఉంటుంద‌ట‌.