ఇది పోసాని పంపిన ఫీలర్

Posani's indirect request to Y S Jagan
Wednesday, July 31, 2019 - 22:00

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టి అపుడే రెండు నెలలు కావొస్తోంది. ఈ రెండు నెలల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పదవులు పొందింది ఇద్దరే. ఒకరు ఎమ్మెల్యే రోజా. ఆమె మంత్రి పదవి ఆశిస్తే.... అది కాకుండా మరో లాభదాయక పదవి ఇచ్చారు. ఆ తర్వాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న భక్తి చానెల్ కి చైర్మన్ గా నియమించారు. తాజాగా అలీకి ఏదో పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. దాంతో పోసాని అలెర్ట్ అయినట్లు ఉoది.

వైఎస్సార్పీ తరపున ప్రచారం చేసిన సినిమా ఇండస్ట్రీ వ్యక్తుల్లో నేను, రోజా మాత్రమే సీనియర్లం అని చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణ మురళి. ఆయన కొంతకాలంగా పొలిటికల్ యాక్టివిటీ తగ్గించాడు. దానికి కారణం తనకి హెల్త్ బాగా లేకపోవడమే అని వివరణ ఇచ్చాడు. ఐతే బుధవారం ఆయన తన ఇంట్లో పెట్టిన ప్రెస్ మీట్  ని జాగ్రత్తగా పరిశీలించి...బిట్వీన్ ది లైన్స్ చదివితే అసలు విషయం అర్థమవుతుంది. తనకి పదవి ఇవ్వాలని ఇన్ డైరక్ట్ గా 
ఫీలర్ ఇచ్చాడు పోసాని.

"జగన్ గారి నుంచి ఏ పదవి ఆశించడం లేదు. నేను ఇపుడు మాట్లాడుతున్నది నా హెల్త్ కండీషన్ గురించే. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. నాకు ఇంకా అనారోగ్యంగానే ఉంది అంటే రావాల్సిన సినిమా ఆఫర్లు రావు. అందుకే ఈ వివరణ ఇస్తున్నా," అని చెపుతూ పోసాని తనకి న్యాయంగా దక్కాల్సిన పొలిటికల్ ఆఫర్ గురించి కూడా మాట్లాడాడు. మీ కంటే జూనియర్లకి పదవులు వచ్చాయి కదా అంటే వారు నాకంటే బాగా పనిచేసి ఉంటారు అని నర్మగర్భంగా మాట్లాడారు పోసాని. అదీ సంగతి.