వాన.. కరోనా.. అవసరమా ప్రభాస్!

Prabhas gets trolled for shooting amidst corona
Saturday, March 14, 2020 - 16:45

మాంఛి కరోనా టైమ్ లో షూటింగ్ కోసం యూరోప్ వెళ్తున్నాడనగానే అంతా కళ్లు చిట్లించారు. ప్రభాస్ కు మతిపోయిందా అంటూ సోషల్ మీడియాలో తమ కోపం చూపించారు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే తిరిగి వచ్చేయమని ఎంత ప్రాధేయపడ్డారో ఫేస్ బుక్ ఫాలో అయిన జనాలకు బాగా తెలుసు. అయినప్పటికీ ప్రభాస్ వినలేదు. జార్జియా వెళ్లాడు, షూటింగ్ స్టార్ట్ చేశాడు.

ఇది చాలదన్నట్టు హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియా వెళ్లింది. ముఖానికి మాస్క్ వేసుకొని మరీ ఎయిర్ పోర్ట్ లో ఫొటో దిగింది. ఇద్దరూ కలిసి ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ లో 10 డిగ్రీల చలి ఉంది. దీనికి తోడు వాన కురుస్తోంది. కరోనా వ్యాప్తి చెందడానికి ఇది ఎంతో అనుకూలమైన వాతావరణం. అయినప్పటికీ యూనిట్ మాత్రం "మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. టీమ్ స్పిరిట్" అంటూ కొటేషన్లు పెడుతూ పని కానిచ్చేస్తున్నారు.

ప్రపంచమంతా కరోనాతో వణికిపోతున్న ఈ పరిస్థితుల్లో అసలు యూరోప్ షెడ్యూల్ పెట్టుకోవడమే చాలా పెద్ద తప్పు. మరీ ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్ని కరోనా వణికిస్తున్న టైమ్ లో అటు వైపు వెళ్లడం ఇంకా ప్రమాదకరం. ఇలాంటి టెన్షన్ మధ్య షూటింగ్ అవసరమా అంటున్నారు ఫ్యాన్స్.

ఎలాగూ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకాస్త ఆలస్యమౌతుందంతే. ఆమాత్రం దానికి ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా యూరోప్ కు వెళ్లమని, సెట్స్ వేసి సిటీలోనే షూటింగ్ కానిచ్చేస్తామని గతంలో చెప్పిన నిర్మాతలు, ఇప్పుడీ కరోనా టైమ్ లో యూరోప్ షెడ్యూల్ ఫిక్స్ చేయడం ఏంటంటూ.. యూవీ ట్విట్టర్ హ్యాండిల్స్ కు ఒకటే కామెంట్స్ పడుతున్నాయి.