నెయ్యి, పచ్చడి కావాలన్న ప్రభాస్

Prabhas says simple meal is enough
Thursday, October 24, 2019 - 18:00

బాహుబలి డైరీస్ లో భాగంగా ఇప్పటికీ ఆ సినిమా అనుభవాల్ని యూనిట్ పంచుకుంటూనే ఉంది. సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ వేదికలపై బాహుబలి టైమ్ నాటి ముచ్చట్లను ప్రేక్షకులతో పంచుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభాస్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు రాజమౌళి. లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన బాహుబలి లైవ్ కన్సర్ట్ కార్యక్రమంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

బాహుబలి ఫిజిక్ కోసం ప్రభాస్ తన ఆహారపు అలవాట్లు బాగా మార్చుకున్న విషయం తెలిసిందే. పూర్తిగా మాంసాహారం పక్కనపెట్టేశాడు. అయితే నెలలో ఒక రోజు మాత్రం ఛీటింగ్ మీల్ (నచ్చింది తినే వెసులుబాటు) ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. ఆ రోజున ప్రభాస్ కోసం ఆయన బావ చాలా వంటకాలు సిద్ధం చేసి పెట్టేవాడు. బిర్యానీలే దాదాపు 15 రకాల వరకు రెడీ చేశావాడు. అయితే టేబుల్ పై ఎన్ని వంటకాలున్నా ఏదో ఒకటి లేదని వంక పెట్టేవాడట ప్రభాస్. ఓ నెలలో ఇలానే ఛీట్ మీల్ లో భాగంగా దాదాపు 30 రకాలు సిద్ధంచేస్తే.. "నెయ్యి, తొక్కుపచ్చడి లేదా బావ" అని అడిగాడట ప్రభాస్.

ప్రభాస్ భోజనప్రియుడు అనే విషయాన్ని రాజమౌళి ఇలా బయటపెట్టాడు. అలా నెలలో ఒక రోజు మాత్రమే తనకు ఇష్టమైన భోజనం చేస్తూ, మిగతా 29 రోజులు సినిమా కోసం చాలా కష్టపడ్డాడని వెల్లడించాడు. రానా కూడా అంతే దీక్షగా పనిచేశాడని, బాహుబలి విజయం వెనక వాళ్ల కష్టం ఎంతో ఉందని మెచ్చుకున్నాడు రాజమౌళి.