పెట్రోల్ బంక్ పెట్టాలనుకున్నాను: ప్రభాస్

Prabhas wanted to run a petrol bunk before turning hero
Monday, August 26, 2019 - 15:15

లైఫ్ లో లైట్ గా ఉండడం తనకు ఇష్టమంటున్నాడు ప్రభాస్. కాస్త ఛాలెంజింగ్ గా ఉండడం ఇష్టమని, అందుకే 19 ఏళ్ల వయసు నుంచే రకరకాల ఆలోచనలు చేస్తూ, చివరికి సినిమాల్లోకి వచ్చానని చెబుతున్నాడు. ఒక దశలో పెట్రోల్ బంక్ పెట్టాలనుకొని హీరోగా మారానని వెల్లడించాడు. 

"చిన్నప్పుడు రకరకాల ఆలోచనలు ఉండేవి. రెస్టారెంట్ పెట్టాలని అనుకున్నాం. పెట్టాం కూడా. పెట్రోల్ బంక్ పెట్టాలనుకున్నాం. నచ్చింది తిని, బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఊరంతా తిరగొచ్చనేది నా 19 ఏళ్ల నాటి ఆలోచన. కానీ 22 ఏళ్లకు సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు బాహుబలి చేశాను. అప్పటి నా ఆలోచనల్ని నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు గుర్తుచేస్తుంటారు. అంతా కలిసి నవ్వుకుంటాం." 

తను సినిమాల్లోకి రావడం అమ్మకు ఇష్టంలేదంటున్నాడు ప్రభాస్. బాహుబలి-1 రిలీజ్ ముందు వరకు సినిమాలు చేయొద్దని తనకు చెబుతూ వచ్చేదని, బాహుబలి-2 పెద్ద హిట్ అయిన తర్వాత గర్వపడకంటూ జాగ్రత్తలు చెబుతుందని చెప్పుకొచ్చాడు.

"మా అమ్మ నాకు చాలా చెబుతుంది. బాహుబలి తర్వాత తల ఎగరేయొద్దని చెప్పింది. నిజానికి నేను సినిమాల్లోకి రావడం అమ్మకు ఇష్టంలేదు. ఆమెకు నేనేదైనా ఉద్యోగం చేసుకొని సెటిల్ అవ్వడమంటే ఇష్టం. ఉద్యోగం చేయాలి, ఇల్లు కొనుక్కోవాలి, సాయంత్రం ఇంటికి వచ్చేయాలి. ఇలా ఉంటాయి అమ్మ ఆలోచనలు. నేను అలా ఉండలేను. పుట్టుకతోనే నేను అదో టైపు." 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏదైనా ఓ కీలకమైన విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే రాజమౌళికి ఫోన్ చేస్తానంటున్నాడు ప్రభాస్. రాజమౌళితో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయని, సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెబుతున్నాడు.

"బాహుబలి తర్వాత రాజమౌళికి దూరమైపోలేదు. రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాను. సాహో సినిమా టైమ్ లో కూడా రామోజీ ఫిలింసిటీలో కలిసి వర్క్ చేశాం. నా సెట్స్ కు కూడా వచ్చాడు. ఏవైనా నా జీవితానికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు రాజమౌళితోనే డిస్కస్ చేస్తాను."

సాహో సినిమాతో థియేటర్లలోకి వస్తున్న ప్రభాస్.. బాహుబలి-2తో సాహోను ముడిపెట్టొద్దని కోరుతున్నారు. జానర్ పరంగా ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని, ఓపెన్ మైండ్ తో సాహో చూడాలని కోరుతున్నాడు.