రాహుల్ కు ప్రకాష్ రాజ్ అండ

Prakash Raj's support to Rahul Sipligunj
Monday, March 9, 2020 - 19:00

రాజకీయంగా రాహుల్ ను తొక్కేద్దామని చూస్తున్నారేమో.. రాహుల్ కు ఎవరూ లేరని అనుకుంటున్నారేమో.. రాహుల్ కు నేనున్నాను... నాతో పాటు ఇండస్ట్రీ మొత్తం రాహుల్ కు అండంగా ఉంది.

ఈ మాటలు అంటోంది ఎవరో కాదు, నటుడు ప్రకాష్ రాజ్. పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడిని ఖండించిన ప్రకాష్ రాజ్.. అతడికి అండగా నిలబడ్డాడు. రాహుల్ కు న్యాయం జరిగేవరకు పోరాడతానని స్పష్టంచేశారు. కేసుకు సంబంధించి కమిషనర్ తో మాట్లాడతానని కూడా మీడియా ముందు ప్రకటించారు.

రాజకీయాల్లో ఉంటే ఏదైనా చేయొచ్చనే అహంకారం మంచిది కాదన్నారు ప్రకాష్ రాజ్. పది మంది కలిసి ఒక్కడ్ని కొడుతుంటే చూస్తూ ఊరుకునే తత్వం తనది కాదన్నారు. అందుకే ముందుకొచ్చానని, రాహుల్ కు సపోర్ట్ గా నిలిచానని అన్నారు. ఈ కేసు విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని స్పష్టంచేశారు.

రంగమార్తాండ సినిమాతో రాహుల్, ప్రకాష్ రాజ్ దగ్గరయ్యారు. ఆమధ్య జరిగిన న్యూఇయర్ పార్టీలో కూడా ప్రకాష్ రాజ్ ఫామ్ హౌజ్ లో రాహుల్ ఆడిపాడాడు. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇంట్లో ఉన్న రాహుల్ ను డబ్బింగ్ థియేటర్ కు తీసుకెళ్లారు ప్రకాష్ రాజ్. ఈ నటుడి రాకతో రాహుల్ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.