కేజీఎఫ్ ద‌ర్శ‌కుడి నెక్స్ట్ మూవీ మైత్రీకే

Prasanth Neel to direct for Mythri Movie Makers
Tuesday, June 4, 2019 - 16:00

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ దొరికిన ప్ర‌తి ద‌ర్శ‌కుడికి, హీరోకి అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేస్తోంది. క‌థ‌, కాక‌ర‌కాయ‌లు త‌ర్వాత ముందు కాంబినేష‌న్ సెట్ చేసుకోవాలి. హిట్ కొట్టిన డైర‌క్ట‌ర్‌, హీరో ఉంటే చాలు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి క‌మిట్ చేయిస్తోంది. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ తీస్తున్న సినిమాల‌న్నీ అలా కుదిరిన‌వే. తాజాగా ప్ర‌శాంత్ నీల్‌ని కూడా త‌మ ద‌ర్శ‌కుల జాబితాలో క‌లిపేసుకొంది. ప్ర‌శాంత్ నీల్ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు. దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కెజీఎఫ్ చిత్రంతో పేరు తెచ్చుకున్నాడు ఈ యువ డైర‌క్ట‌ర్‌. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2  తీస్తున్నాడు. ఆ సినిమా బిజీ ఉండ‌గానే త‌మ ద‌ర్శ‌కుడికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపింది మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌. 

అంటే ఆ ద‌ర్శ‌కుడితో త‌మ త‌దుప‌రి చిత్రం ఉంద‌ని ఇప్ప‌టికే హింట్ ఇచ్చింది. ప్ర‌శాంత్ నీల్ ఆ మ‌ధ్య హ‌డావుడిగా హైద‌రాబాద్‌కి వ‌చ్చి మ‌హేష్‌బాబుకి క‌థ చెప్పి వెళ్లాడు. కేజేఎఫ్ 2 విడుద‌ల త‌ర్వాత ఫుల్ స్క్రిప్ట్ వినిపిస్తాన‌ని చెప్పాడు. బ‌హుశా ఈ కాంబినేష‌న్‌నే మైత్రీ సెట్ చేసిందేమో.