పూరి టేకింగ్ మార‌లేదే!

Puri has not changed his taking style
Saturday, June 15, 2019 - 15:45

ఫ్లాప్‌ల ప‌రంప‌ర నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పూరి జ‌గ‌న్నాథ్ త‌న పంథాని మార్చుకున్నాడ‌నీ, ఇస్మార్ట్ శంక‌ర్‌లో కొత్త పూరిని చూస్తార‌ని వినిపించింది. కానీ ఆయ‌న పాట‌ల చిత్రీక‌ర‌ణ తీరు ఏమీ మారిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. మొద‌టి పాట ఇప్ప‌టికే విడుద‌లైంది. అది ప‌క్కా పూరి పాత సినిమాల ప‌ద్ద‌తిలోనే సాగింది. 

తాజాగా జిందాబాద్ జిందాబాద్ అనే రెండో పాట వ‌చ్చింది. ఈ సినిమా మేకింగ్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది... చిరుత‌, బుజ్జిగాడు, లోఫ‌ర్ సినిమాల త‌ర‌హాలోనే ఉంద‌ని. ప్ర‌తి ద‌ర్శ‌కుడికి పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో ఒక ప్ర‌త్యేక‌మైన శైలి ఉంటుంది. ఆ శైలిని బ్రేక్ చేసి కొత్త స్ట‌యిల్‌కి రావ‌డం అంత ఈజీ కాదు. అందుకే పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌లో ఇక కొత్త పూరిని చూస్తార‌ని చెపుతున్నా... ఆయ‌న టేకింగ్ స్ట‌యిల్‌లో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేదు.

ఇస్మార్ట్ శంక‌ర్‌లో రామ్ హీరో. నిధి అగ‌ర్వాల్‌, న‌భ న‌టేష్ హీరోయిన్లు. చార్మి నిర్మించిన ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. వ‌చ్చే నెల 12న విడుద‌ల కానుంది ఇస్మార్ట్ శంక‌ర్‌.