పారాసైట్ పై వివరణ ఇచ్చిన జక్కన్న

Rajamouli gives clarification on Parasite statement
Friday, April 24, 2020 - 13:45

"ఆస్కార్ అవార్డ్ అందుకున్న పారాసైట్ సినిమా నాకు నచ్చలేదు. బిగినింగ్ మరీ బోరింగ్ గా ఉంది. సగం సినిమా చూస్తుండగానే నిద్రపోయాను. లేచిన తర్వాత మిగతా స్టోరీ నాకు నా భార్య చెప్పింది. ఎందుకో ఆ సినిమా నాకు అంతగా ఎక్కలేదు."

సరిగ్గా 3 రోజుల కిందట పారాసైట్ సినిమాకు సంబంధించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలివి. దీంతో నెటిజన్లు రాజమౌళిపై భగ్గుమన్నారు. ఒరిజినల్ కంటెంట్ తో, సామాన్యుడి మనసుల్ని తాకేలా, అప్పటి కొరియా పరిస్థితుల్ని కళ్లకు కట్టేలా తీసిన సహజమైన సినిమా నచ్చకపోవడం ఏంటని రాజమౌళిని ట్రోల్ చేశారు. నచ్చకపోతే బయటకు చెప్పకూడదని, అంతేకానీ ఆస్కార్ అందుకున్న సినిమాను కించపరచడం మంచిది కాదంటూ కామెంట్స్  పడ్డాయి. దీంతో రాజమౌళి జాగ్రత్త పడ్డాడు. మరోసారి పారాసైట్ సినిమాపై తన వెర్షన్ వినిపించాడు.

"పారాసైట్ నాకు నచ్చకపోవడం అనేది నా వ్యక్తిగత అభిరుచి. ఇక ఆస్కార్ జ్యూరీ ప్రమాణాలంటారా.. అక్కడ కూడా లాబీయింగ్ ఉంటుంది. మీ సినిమాని జ్యూరీ మెంబర్స్ చూడాలంటే చాలా తతంగం ఉంటుంది. అయినా సరే నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటిస్తుంటారని ప్రపంచం నమ్ముతుంది. ఎంత లాబీయింగ్ ఉన్నప్పటికీ చెత్త సినిమాను తీసుకెళ్లి పాస్ చేసేసి అవార్డ్ ఇచ్చే పరిస్థితి ఉండదని అంటుంటారు. నాకైతే జ్యూరీ ప్రాసెస్ గురించి పెద్దగా అవగాహన లేదు. గతంలో కూడా ఆస్కార్ అందుకున్న సినిమాల్లో నాకు నచ్చనివి  ఉన్నాయి. ఇప్పుడు పారాసైట్ కూడా అలానే స్పందించాను."

ఇలా పారాసైట్ పై మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు రాజమౌళి. ఇప్పటికైనా అతడిపై ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి.