అపుడు ఇపుడు... ఎన్టీఆర్‌, రాజమౌళి

Rajamouli recalls Student no.1 days
Friday, September 27, 2019 - 16:45

"స్టూడెంట్‌ నెంబర్‌వన్‌"సినిమాతో రాజమౌళి దర్శకుడిగా ఎదిగారు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలైంది స్టూడెంట్‌ నెంబర్‌వన్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌కి తొలి హిట్‌. రాజమౌళి కెరియర్‌కి అరంగేట్రం. ఈ 18 ఏళ్ల కాలంలో రాజమౌళి నెంబర్‌వన్‌ డైరక్టర్‌గా ఎదిగారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా స్థిరపడ్డారు. 

18 ఏళ్ల క్రితం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒక బల్లపై కూర్చొని ఎన్టీఆర్‌కి సీన్‌ వివరిస్తున్న ఫోటోని షేర్‌ చేస్తూ... ఇపుడు అదే ప్లేస్‌లో ఎన్టీఆర్‌తో కలిసి కూర్చొన్న ఫోటోని జత చేసి...ఓల్డ్‌ మెమెరీస్‌ని రిప్రెష్‌ చేసుకున్నారు రాజమౌళి. ఇపుడు ఎన్టీఆర్‌పై కొన్ని కీలక సీన్లను ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం కోసం తీస్తున్నారు రాజమౌళి.

ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్‌ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నాడు. ఐతే ఈ సీన్‌ మాత్రం ఎన్టీఆర్‌తో తీస్తున్నప్పటిది. సేమ్‌ ప్లేస్‌లో ఫోటో దిగి ఈ కామెంట్‌ పెట్టారు: "అప్పటికి ఇప్పటికీ ఎంతో మారింది. తను (ఎన్టీఆర్‌) సన్నబడ్డాడు. నాకు వయసు పెరిగింది. ఐతే ఇద్దరిలోనూ పరిణతి వచ్చింది.''

ఆర్‌.ఆర్‌.ఆర్‌ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. రాజమౌళి , ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు స్టూడెంట్‌ నెంబర్‌వన్‌, సింహాద్రి, యమదొంగ చిత్రాలు వచ్చాయి.