రాజమౌళి అంతరంగం: రిలీజ్ డేట్ ఇప్పుడు చెప్పలేను

Rajamouli talks about RRR, lockdown and more
Monday, April 20, 2020 - 16:30

లాక్డౌన్ పీరియడ్ లో దర్శకధీరుడు రాజమౌళి తన తాజా సినిమా "ఆర్.ఆర్.ఆర్" గురించి, తన వద్ద ఉన్న కథల గురించి డిటైల్డ్జ్ గా చెప్పాడు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు. సంక్షిప్తంగా.... మీ కోసం. రాజమౌళి అంతరంగం....

- నా లాక్ డౌన్ పీరియడ్
వ్యక్తిగతంగా చూస్తే లాక్ డౌన్ వల్ల నాకు ఇబ్బందేం లేదు. అనుకోని హాలిడే వచ్చింది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం. కానీ భవిష్యత్ ఏంటని ఆలోచిస్తే కాస్త భయం వేస్తోంది. కరోనా తర్వాత ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆలోచిస్తున్నాను. వలస కార్మికుల పరిస్థితి తలుచుకుంటే మాత్రం బాధ కలుగుతోంది.

- ఏదో ఒక మీనింగ్ ఇవ్వాలి కాబట్టి...
రౌద్రం-రణం-రుధిరం అనేది ఏంటంటే.. ఏదో ఒక మీనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. మా సినిమాను RRR అని పిలవాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా తీస్తున్నప్పుడు భాషతో సంబంధం లేకుండా ఒకే టైటిల్ ప్రాచుర్యం పొందాలనేది నా ఆలోచన. అందుకే RRRను అలానే ఉంచేశాం. రిజిస్ట్రేషన్ కూడా RRR అనే రిజిస్టర్ చేశాం.

- అనుకొని పెట్టిన టైటిల్ కాదది
స్టార్టింగ్ లో టైటిల్ అనుకోలేదు. వర్కింగ్ టైటిల్ ఉండాలి, మేం మాట్లాడుకోవడానికి ఓ పేరు కావాలి కాబట్టి మా ముగ్గురు పేర్లు కలిసొచ్చేలా RRR అనుకున్నాం. అయితే అలా ముందుకెళ్లేకొద్దీ, 2 నెలల తర్వాత ఇదే బాగా పాపులర్ అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే బాగుందని చెప్పడంతో దీన్నే ఫైనల్ చేశాం.

- అవును.. చరణ్ పోలీస్
టీజర్ లో రామ్ చరణ్ ను పోలీస్ గా చూపించాం. సినిమాలో ఓ షేడ్ లో ఆయన పోలీస్ గానే కనిపిస్తాడు. చరిత్రలో ఇది ఉందా లేదా అనేది నేను చర్చించను. ఎందుకంటే ఇదొక ఫిక్షన్ కథ. కొమరం భీమ్, అల్లూరి కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అల్లిన కథ. కాబట్టి చరిత్రకారులతో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్ఆర్ఆర్ అనేది హిస్టారికల్ మూవీ కాదు.. ఫ్రెండ్ షిప్ ను బేస్ చేసుకొని తీసిన సినిమా.

- నా దేశభక్తిని సినిమాల్లో చూపించను
దేశానికి ఏదో చెప్పాలని, చరిత్ర చూపించాలని RRR కథ ఎంచుకోలేదు. ఓ ప్రేక్షకుడు, ఓ బయ్యర్, ఓ నిర్మాత నన్ను నమ్మి డబ్బు పెడుతున్నారు. ముందు వాళ్లే నా మైండ్ లోకి వస్తారు. నా సామాజిక బాధ్యత, దేశభక్తిని సినిమాల్లో చూపించాలని అనుకోను.

- తారక్-చరణ్ కలిస్తే బాగుంటుందనేది నా ఫాంటసీ
తారక్, చరణ్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే చాలా బాగుంటుందనే ఆలోచన నాకు ఎప్పట్నుంచో ఉంది. ఆర్ఆర్ఆర్ కు ఈ ఆలోచనకు సంబంధం లేదు. బాహుబలి-2 తర్వాత ఈ ఆలోచనను అమలుచేయాలని భావించాను. 2-3 కాన్సెప్టులు అనుకున్నాం. ఆర్ఆర్ఆర్ స్టోరీలైన్ నాకు బాగా అనిపించింది. చరణ్, తారక్ ఇద్దర్నీ ఒకేసారి ఇంటికి పిలిచాను. ఒకరు వస్తున్నారని మరొకరికి తెలియదు. ఇద్దరికీ ఒకేసారి కథ చెప్పాను. వెంటనే ఇద్దరూ ఓకే చెప్పారు.

- నేను..నా టెక్నీషియన్స్
టెక్నీషియన్స్ ను మార్చడం ప్రయోగమని నేను అనుకోను. పైగా సౌకర్యంగా కూడా ఉంటుంది. కాబట్టి టెక్నీషియన్స్ ను మార్చను. ప్రయోగం అంటే ఏంటంటే.. కథలను కొత్తగా చెప్పడం ప్రయోగం. నా వరకు నాకు సింహాద్రి తర్వాత రగ్బీ గేమ్ ఆధారంగా సై తీయడం ప్రయోగం. మగథీర తర్వాత మర్యాదరామన్న, ఈగ చేయడం ప్రయోగాలు. టెక్నీషియన్స్ మార్చడం అనేది ప్రయోగం అనిపించుకోదు.

- పుస్తకాలు చదువుకుంటున్నా
ఈ లాక్ డౌన్ లో ఆర్ఆర్ఆర్ పనులు పెద్దగా జరగడం లేదు. నా సొంత పనులే చేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా 10-12 ఏళ్ల నుంచి రీడింగ్ బాగా తగ్గిపోయింది. చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేశాను. గతంలో ఫిక్షన్ ఎక్కువ చదివేవాడ్ని. ఇప్పుడు సినిమాకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. మల్లాది, యండమూరి రచనలంటే చాలా ఇష్టం

- పారాసైట్ పెద్దగా ఎక్కలేదు
రీసెంట్ గా Special OPS అనే వెబ్ సిరీస్ చూశాను చాలా బాగుంది. ఫ్యామిలీ మేన్ కూడా చూడాలి. మొన్ననే ట్రాన్స్ అనే సినిమా చూశాను. చాలా బాగుంది. నాక్కూడా వెబ్ సిరీస్ చేయాలనే కోరిక ఉంది. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ లో వెబ్ సిరీస్ చేస్తాను. ఆస్కార్ అవార్డ్ అందుకున్న పారాసైట్ సినిమా కూడా చూశాను. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు. బిగినింగ్ చాలా స్లోగా ఉంది. సగం చూశాక నిద్రపోయాను. ఆ తర్వాత మిగతా స్టోరీ మా ఆవిడ నాకు చెప్పింది. ఎందుకో నాకు పెద్దగా ఎక్కలేదు.

- మహేష్ తో మూవీ స్టోరీ డిస్కషన్ జరుగుతోంది
మహేష్ మూవీ కొత్తగా ఎనౌన్స్ చేసింది కాదు. 7 ఏళ్లుగా నలుగుతున్న సినిమానే. మా ఇద్దరి కమిట్ మెంట్స్ వల్ల లేట్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నా నెక్ట్స్ సినిమా అదే. మహేష్ మూవీ కోసం స్టోరీ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాం. నాన్నగారు, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ 2 రోజులు చర్చించాం. ఇంకా నడుస్తోంది.

- కీరవాణి కేవలం కంపోజర్ కాదు
కీరవాణిని ఓ మ్యూజిక్ డైరక్టర్ గా కంటే జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తిగా బాగా నమ్ముతాను. అన్నయ్య (కీరవాణి) సినిమాల్ని బాగా జడ్జ్ చేస్తాడు. కథ ఓ స్వరూపానికి వచ్చిన తర్వాత అతనికి వినిపిస్తాను. బాగుదంటే ముందుకెళ్తాం. షూటింగ్ టైమ్ లో కూడా అన్నయ్య మాటకు విలువిస్తాను. ఓ సీన్ బాగాలేదంటే దాని ఆర్డర్ మార్చడమో లేక రీషూట్ చేయడమో చేస్తాను. అన్నయ్య మాటకు అంత విలువిస్తాను నేను.

- జనవరి 8 రిలీజ్.. అప్పుడే చెప్పలేం
వచ్చే ఏడాది జనవరి 8కి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించిన మాట నిజమే. కానీ లాక్ డౌన్ వచ్చింది. దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు. లాక్ డౌన్ తర్వాత ఎప్పట్నుంచి షూట్స్ స్టార్ట్ అవుతాయి అనే అంశాలపై రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అప్పుడే చెప్పలేం. మా ఫీల్డ్ లో కూడా రోజుకూలీపై పనిచేసే సినీకార్మికులున్నారు కాబట్టి తొందరగానే అనుమతులు వస్తాయని అనుకుంటున్నాం. ఏదేమైనా ప్రభుత్వం నుంచి స్పష్టంగా గైడ్ లైన్స్ వచ్చేవరకు రిలీజ్ డేట్ గురించి చెప్పలేం.

- కరోనా ఎఫెక్ట్ రెండేళ్లు పక్కా
కరోనా ప్రభావం మరో రెండేళ్ల పాటు మనపై ఉంటుంది. ఆర్థికంగా, సామాజికంగా, వైద్యపరంగా, మానసికంగా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఈ రెండేళ్లలో ఎంటర్ టైన్ మెంట్ ను ఎలా అందిస్తామనేది ఆలోచించుకోవాలి. మనల్ని మనం మలుచుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ రెండేళ్ల కాలం తర్వాత జనాలు థియేటర్లకు సముద్రం వచ్చినట్టు వస్తారు. ఆ వేవ్ లా వచ్చినప్పుడు కూడా మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండేళ్లలో జనాలు రకరకాల వెబ్ సిరీస్ లు, విదేశీ సినిమాలు చూసి ఉంటారు. కాబట్టి రెండేళ్ల తర్వాత వాటిని దృష్టిలో పెట్టుకోవాలి.

- నా కథలకు సూటయ్యే నటీనటులు మాత్రమే
నా కథల్లో పాత్రలకు ఎవరు సూట్ అవుతారని నేను అనుకుంటానో వాళ్ల దగ్గరకు వెళ్లి అడుగుతాను. అందులో మొహమాటపడను. మభ్యపెట్టే ప్రసక్తి లేదు. మగధీర తర్వాత మర్యాదరామన్న అనుకున్నప్పుడు నేనే స్వయంగా సునీల్ ను అడిగాను. ఎందుకంటే ఆ పాత్రకు సునీలే కరెక్ట్. ఈగ సినిమాకు నాని అయితే బాగుంటుందని నేనే వెళ్లి అడిగాను. ఆర్ఆర్ఆర్ లో పాత్రకు అజయ్ దేవగన్ బాగుంటుందనిపించి స్వయంగా వెళ్లి అడిగాను.

- నా దగ్గర బోలెడన్ని కథలున్నాయి
నాన్నగారు (విజయేంద్రప్రసాద్), నేను 30 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాం. మేమిద్దరం కలిసి డెవలప్ చేసిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి. అద్భుతంగా ఉందనిపించిన కథలు చాలా ఉన్నాయి. వాటికంటే బెటర్ అనిపించే సబ్జెక్ట్ బయట రచయిత నుంచి వస్తే తప్పకుండా సినిమా చేస్తాను. కానీ మేమిద్దరం తయారుచేసుకున్న కథలే చాలా ఉన్నాయి. వాటిలోంచి పిక్ చేసుకుంటే సరిపోతుంది.