'గరుడ వేగ‌ 2' ప్ర‌క‌టించిన రాజ‌శేఖ‌ర్‌

Rajasekhar announces Garuda Vega 2
Monday, June 24, 2019 - 22:00

రాజ‌శేఖ‌ర్ న‌టించిన "క‌ల్కి" సినిమా ఈ వీకెండ్ విడుద‌ల కానుంది. ట్ర‌యిల‌ర్స్‌, టీజ‌ర్స్‌తో క‌ల్కి సినిమా అంచ‌నాల‌ను పెంచేస్తోంది. ప్ర‌వీణ్ స‌త్తారు తీసిన "గ‌రుడ‌వేగ" సినిమాతో యాంగ్రీమేన్ రాజ‌శేఖ‌ర్ కొత్త తరానికి న‌చ్చాడు. ఇపుడు అదే పంథాలో వెళ్తూ క‌ల్కిని చేశారు. ఇదే ఊపులో "గ‌రుడ‌వేగ" సినిమాకి సీక్వెల్ ప్ర‌క‌టించారు రాజ‌శేఖ‌ర్‌.

"గరుడవేగ’తో మమ్మల్ని ప్రవీణ్‌ సత్తారుగారు ఒక లెవల్‌లో పెట్టారు. ఇప్పుడు మేం లెవల్‌కి వెళ్లాలనేది మా అందరి టార్గెట్‌.  ‘గరుడవేగ’తో పోలిస్తే... ఇది డిఫరెంట్‌ ఫిల్మ్‌. కాకపోతే ఆ సినిమా చూసిన ఆడియన్స్‌కి కచ్చితంగా ‘కల్కి’ శాటిష్‌ఫ్యాక్షన్‌ ఇస్తుందని చెప్పగలను," అన్నారు రాజ‌శేఖ‌ర్‌. 

కొత్త ద‌ర్శ‌కుల‌తో వ‌ర్క్ చేసిన త‌ర్వాత త‌న‌కి కాన్ఫిడెన్స్ పెరిగిందంటున్నారు రాజ‌శేఖ‌ర్‌. 

"ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. యంగ్‌ జనరేషన్‌ దగ్గర బాగా వర్క్‌ చేయడం నేర్చుకున్నా. యంగ్‌ జనరేషన్‌కి నేను చెప్పేది ఒక్కటే... మంచి సబ్జెక్ట్‌ ఉంటే రండి, సినిమా చేద్దాం. మనకు సూపర్‌ ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా,’’ అన్నారు రాజ‌శేఖ‌ర్‌.

మెగాస్టార్ చిరంజీవితో రామ్‌చ‌ర‌ణ్ ఎలా మంచి సినిమాలు ప్రొడ్యుస్ చేస్తున్నాడో, త‌న కూతుళ్లు త‌న‌కి అలా చేస్తున్నార‌ని త‌న పుత్రికోత్సాహాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు యాంగ్రీమేన్‌.

"నా ప్రతి సినిమాకు జీవిత చాలా కష్టపడతారు. నేను కథ విన్నాక... క్యారెక్టర్‌ గురించి ఆలోచిస్తా. ప్రొడక్షన్‌ గురించి ఆలోచించను. జీవిత కష్టపడి కల్యాణ్‌గారు చెప్పిన బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశారు. అలాగే, ఈ సినిమాకు నాతో పాటు మా పిల్లలకు కూడా కష్టపడ్డారు. చిరంజీవిగారితో వాళ్లబ్బాయి సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నారని అనగానే... నాకు అబ్బాయి ఉంటే చేసేవాడని అనుకున్నా. మా అమ్మాయిలు ఇద్దరూ సూపర్‌గా చేశారు. అయామ్‌ వెరీ హ్యాపీ."