రజినీకాంత్ రొమాంటిక్ సైడ్!

Rajinikanth's romantic pic goes viral
Tuesday, October 1, 2019 - 16:30

సూపర్ స్టార్ రజినీకాంత్ ఏజ్ 60 ప్లస్. ఆయనికిద్దరు అమ్మాయిలు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కానీ ఇప్పటికీ ఆయన స్థానం వేరు. ఆయన రేంజ్ వేరు. తమిళనాట రజినీకాంత్ మేనియాని రీప్లేస్ చేసేంత పాపులారిటీ కొద్దో గొప్పో విజయ్ కి వచ్చింది కానీ ఆయనకున్నట్లుగా దేశమంతా పాపులారిటీ మాత్రం ఇంకో తమిళ స్టార్ కి లేదు. అందుకే రజినీకాంత్ తన రియల్ లైఫ్ కి చెందిన కోణాన్ని ఎవరైనా ప్రెజంట్ చేస్తే అది బాగా వైరల్ అవుతుంది. అలాగే జరిగింది నిన్నటి ఫొటోతో. 

"దర్బార్" సినిమా షూటింగ్లో రజినీకాంత్ షాట్ గ్యాప్ లో రిలాక్స్డ్ గా కుర్చీలో కూర్చున్నప్పుడు... ఆయన భార్య లత రజినీకాంత్ వెనకనుంచి వచ్చి ఆప్యాయంగా వాటేసుకున్న సందర్భాన్ని స్టిల్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఆ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఈ ఏజ్ లోనూ రజినీకాంత్ రొమాంటిక్ సైడ్ మామూలుగా లేదే అంటూ కామెంట్స్ పడుతున్నాయి. 

1981లో రజినీకాంత్ లతా రంగాచారిని పెళ్లాడారు. వీరిద్దరి పరిచయం ఒక మూవీ సెట్ లో జరిగింది. 1980లో కాలేజీలో చదువుకుంటున్న లత ... కాలేజీ మ్యాగజిన్ కోసం రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేసారు. చూడగానే ఆమెని ఇష్టపడ్డ రజినీకాంత్ ఆమెని పెళ్లాడుతానని ప్రపోజల్ పెట్టారు. ఏడాది తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఒకటయ్యారు. సౌందర్య, ఐశ్వర్య ...వీరి సంతానం. తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన ధనుష్... రజినీకాంత్ కి అల్లుడు.